పెట్రో బాదుడుతో హడలిపోతున్న సామాన్యులు

పెట్రో బాదుడుతో హడలిపోతున్న సామాన్యులు

ఓ వైపు కరోనా టెన్షన్‌.. మరోవైపు పెట్రో బాదుడుతో సామాన్యులు హడలిపోతున్నారు.. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 16వ రోజు కూడా ఇంధన ధరలు పెరగడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. సోమవారం పెట్రోల్‌పై 33 పైసలు, డీజిల్‌పై 55 పైసలను చమురు సంస్థలు పెంచాయి. దీంతో గత 16 రోజుల్లో పెట్రోల్‌పై 8 రూపాయల 36 పైసలు, డీజిల్‌పై8 రూపాయల 82 పైసలు ధర పెరిగింది. రెండు వారాలుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం ఇంకాస్త ప్రభావం చూపిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 1.08 శాతం పెరుగుదలతో 41.96 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.57 శాతం పెరుగుదలతో 39.45 డాలర్లకు ఎగసింది. దీంతో దేశీయ ఇంధన ధరలకు బ్రేక్‌లు లేకుండా పోతోంది.. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే పెట్రోబాదుడు సెంచరీ కొట్టే అవకాశం ఉంది..

సోమవారం పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 82 రూపాయల 25 పైసలకు పెరిగింది.. ఆంధ్రప్రదేశ్‌లో82 రూపాయల 56 పైసలకు పెరిగింది. చెన్నైలో 82 రూపాయల 58 పైసలు, బెంగళూర్‌లో 81 రూపాయల 81 పైసలు, ఢిల్లీలో 79 రూపాయల 23 పైసలు, కోల్‌కతాలో 86 రూపాయల 95 పైసలు, ముంబైలో 86 రూపాయల 4 పైసలకు పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story