పెరిగిన పెట్రో ధరలు.. దేశవ్యాప్త నిరసనలకు విపక్షాల సన్నాహాలు

పెట్రో ధరలు రికార్డు స్థాయిలోదూసుకుపోతున్నాయి.. దీనికి కేంద్రం చేతగానితనమే కారణమని విపక్షాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి.. దేశవ్యాప్తంగా నిరసనలకు సన్నాహాలు చేస్తున్నాయి.. బీజేపీయేతర పార్టీలన్నీ రేపు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి.

పెట్రో ధరల పెరుగదల ఆగేలా కనిపించడం లేదు. రోజురోజుకూ చమురు ధరలు పైకిపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలో పెట్రోధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్‌ ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ సోమవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది.. దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ ఆందోళనకు విపక్షాలు మద్దతు ప్రకటించాయి.. వామపక్ష పార్టీలు కూడా బంద్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి.

రికార్డు స్థాయిలో పెరిగిపోయిన చమురు ధరలతో రవాణా వ్యవస్థ కుదేలవుతోంది. గూడ్స్‌ రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో చిన్నతరహా, మధ్య తరహా వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలోనూ అంతరాయం ఏర్పడుతోంది.

పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడి నడ్డి విరిస్తున్నాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందకు చేరువవుతున్న పెట్రోధరలతో జీవనం దుర్బరమవుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గినా ఆ తగ్గింపు ప్రజలకు వర్తించడం లేదని, ఎక్సైజ్‌ సుంకాలను పెంచి నిలువు దోపిడీ చేస్తోందని మండిపడుతున్నారు.

దేశవ్యాప్తంగా పెట్రోధరలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా కేంద్ర ప్రభుత్వంలో మాత్రం స్పందన కరువైంది. ఇరాన్‌, వెనిజులాలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులే ధరల పెరుగుదలకు కారణమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. ఈ ధరలను కంట్రోల్‌ చేయడం తమ చేతుల్లో లేదని చేతులెత్తేశారు. కేంద్రం తీరుపై రగిలిపోతున్న విపక్ష పార్టీలు రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. డీఎంకే, ఆర్జేడీ, ఆమ్‌ ఆద్మీ సహా అనేక పార్టీలు భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించాయి.