స్విట్జర్లాండ్‌లో అతిలోక సుందరి విగ్రహం

నాలుగు దశాబ్ధాల పాటు వెండితెరపై తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న అతిలోక సుందరి శ్రీదేవి. దివికేగిన ఈ అందాల తార ఇప్పుడు పర్యాటకుల మనసుని కూడా దోచుకోనుంది. పర్యాటకులకు స్వర్గధామంగా నిలిచిన స్విట్జర్లాండ్‌లో ఈ అతిలోక సుందరి విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

శ్రీదేవి  నటించిన పలు బాలీవుడ్‌ చిత్రాల్లో పాటలు చాలా వరకూ స్విట్జర్లాండ్‌లోనే చిత్రీకరించేవారు. అలాగే ఆమె కెరీర్‌లో బిగ్ హిట్‌‌గా నిలిచిన ‘చాందినీ’ మూవీని ఇక్కడి సుందర ప్రదేశాల్లో తెరకెక్కించారు. స్విట్జర్లాండ్‌లో భారత టూరిస్టులను ఆకర్షించటానికి శ్రీదేవి పాత్రను పరిగణనలోకి తీసుకుని ఆమె విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు స్విస్‌ అధికారులు.

2016లో భారత సినీ దిగ్గజం యష్‌ చోప్రా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. యష్‌ చోప్రా సినిమాల్లో అత్యధిక మూవీలు స్విట్జర్లాండ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లోనే తెరకెక్కాయని, వీటి కారణంగా స్విట్జర్లాండ్‌కు భారత టూరిస్టులు పెరిగారని స్విస్‌ అధికారులు చెబుతున్నారు.