గుండెల్లో బాధ.. న్యూస్ రీడర్‌గా కూతురి మరణవార్త.. వీడియో

వృత్తి ధర్మం. మనసు మానసిక వేదన అనుభవిస్తున్నా మరణ వార్తలు కూడా చదవాలి. ప్రపంచంలో జరిగే వార్తలు చదవడం ఒక ఎత్తయితే తనకూతురి మరణ వార్తనే ప్రేక్షకులకు వినిపించాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. కొన్ని సంఘటనలు చూసినప్పుడు, చదువుతున్నప్పుడు గుండె చెరువవుతుంది. గొంతు మూగబోతుంది. ఆమె కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కుంది. అమెరికాలోని సౌత్ డకోటాకు చెందిన న్యూస్ యాంకర్ ఏంజెలా కెన్నెక్ సీబీఎస్ న్యూస్ చానల్‌లో యాంకర్‌గా పనిచేస్తోంది. ఆరోజు డ్రగ్స్‌పై అవగాహన కల్పించడం గురించి ప్రోగ్రాం చేస్తోంది ఏంజెలా.

డ్రగ్స్ మనిషి జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో వివరిస్తూ తన కూతురినే ఉదాహరణగా చూపించింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ కూతురి మరణ వార్తను ప్రేక్షకులకు వివరించింది. తన 21 ఏళ్ల కుమార్తె ఎమిలీ గ్రోత్ ఎలా చనిపోయిందీ వివరిస్తూ కన్నీరు మున్నీరయింది. డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా ఈ ఏడాది మేలో ఆమె మరణించిందని పేర్కొంటూ.. తన కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.

తన కూమార్తె మరణం గురించి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని తానెప్పుడూ ఊహించలేదని పేర్కొంది. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికీ ఎదురు కాకూడదని బాధని దిగమింగుకుంటూ, జాగ్రత్తగా ఉండాలంటూ యువతని హెచ్చరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుండెల్లో బాధని దిగమింగుకుంటూ డ్రగ్స్ బారిన పడి జీవితాన్ని అన్యాయంగా బలిచేసుకోవద్దంటూ అవగాహన కల్పిస్తున్నయాంకర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.