అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రో ధరలపై చంద్రబాబు స్పందించారు. కేంద్రంపై ఘాటు విమర్శలుచేసిన సీఎం… తన వంతుగా పెట్రోల్, డీజిల్‌పై 2 రూపాయల వ్యాట్ తగ్గిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. మరోవైపు ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. జగన్‌ను కాపాడుతున్నది మోడీ కాదా అంటూ కమలనాథులకు సవాల్‌ విసిరారు.

పెట్రోలు, డీజిల్‌ ధరలు ఆకాశంలో విహరిస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయడానికి కేంద్రం ప్రయత్నించడం లేదు. ఏపీ సీఎం మాత్రం వాహనదారులకు ఊరట కలిగించే ప్రయత్నం చేశారు. మంగళవారం నుంచి పెట్రోల్‌, డీజిల్‌లపై 2 రూపాయలు వ్యాట్‌ తగ్గిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు.

పెట్రో బాంబుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదలే ఇందుకు కారణమని కేంద్రం ప్రజలను మభ్య పెడుతోందని మండిపడ్డారు. చమురు ధరలు తగ్గినప్పుడు దోచుకున్నారని విమర్శించారు. జనం బాధల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు స్పందించాలని కేంద్రానికి హితవు పలికారు.

దేశంలో ఏ రాష్ట్రంలో కట్టని విధంగా ఏపీలో ఇళ్లు కడుతున్నామని సీఎం చెప్పారు. నాలుగేళ్లలో 6 లక్షల 45 వేలకు పైగా ఇళ్లు నిర్మించామన్నారు. 2010లో ఒకే రోజు లక్ష, 2018లో ఒకే రోజు 3 లక్షల గృహ ప్రవేశాలు జరగడం రికార్డన్నారు. ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరక్కుండా 4 స్టేజీల్లో జియో ట్యాగింగ్ చేశామన్నారు. గత ప్రభుత్వం 14 లక్షల ఇళ్లు కట్టామని చెప్పి, 4 వేల కోట్ల అవినీతికి పాల్పండిందని ఆరోపించారు.

వైసీపీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. కేసులున్న జగన్‌ను కాపాడుతోంది కేంద్రమే అన్నారు. జగన్ కేసులు నీరుగార్చడాన్ని నిరూపిస్తే రాజీనామా చేస్తారా అని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజుకు సవాలు విసిరారు. రాష్ట్రం మీద ఆపరేషన్‌ గరుడ ప్రయోగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఇక అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో రాజధాని బాండ్లపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. బాండ్లకు అధిక వడ్డీ చెల్లిస్తున్నారనే భావన ప్రజల్లో ఉందని విష్ణుకుమార్ రాజు సభ దృష్టికి తీసుకొచ్చారు. 12 శాతం వడ్డీ ఇస్తే ఏ బాండ్లైనా 10రెట్లు ఓవర్‌ సబ్‌స్కైబ్‌ అవుతాయని సెటైర్ వేశారు. విష్ణు ఆరోపణలను మంత్రి నారాయణ ఖండించారు. అమరావతికి తిరిగి చెల్లించే ఆదాయ వనరులు లేనందున క్రిసిల్‌ రేటింగ్‌ తక్కువగా ఉందని, అందుకే కొంత ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు.

ప్రశ్నోత్తరాల్లో గ్రామాల అభివృద్థిపై అర్థవంతమైన చర్చ జరిగింది. అధికార, విపక్ష సభ్యులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాద్‌ సైతం గ్రామాలకు అంతర్గత రోడ్లు, డొంక రోడ్లు చాలా ముఖ్యమన్నారు. వీటిపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ సూచనలను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి లోకేశ్‌ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్లు రోడ్లను పట్టించుకోలేదని ఆరోపించారు. గ్రామీణ రోడ్లకు ఈ ఏడాది 400 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.

నరేగాకు అధిక నిధులిచ్చిన కేంద్రం పేరును ప్రస్తావించకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాల రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఎన్డీఏ సొంత పథకం కాదని, ఎప్పటి నుంచో ఉందని ఆర్థిక మంత్రి యనమల కౌంటర్‌ ఇచ్చారు.

విపక్షాలతో పాటు అధికార పార్టీ సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వీటిని పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.