వచ్చే ఎన్నికల్లో ఆయన పేరును ఉపయోగించుకోవాలని బీజేపీ నిర్ణయం

bjp party meeting in new delhi

సార్వత్రిక ఎన్నికల్లో విజయ వ్యూహాలే ప్రధాన ఎజెండాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో భాగంగా పార్టీ పెద్దలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సరికొత్త భారత్‌, పేదరికం లేని భారత్‌ను ఆవిష్కృతం చేయాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర హోంమంత్రి, పార్టీ సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మిగితా ప్రతినిధులు ఆమోదం తెలిపారు. 2022 నాటికి దేశంలోని పేదలందరికీ గృహ వసతి కల్పించాలని సమావేశంలో తీర్మానం చేశారు. ప్రదాని మోదీ 2022 విజన్‌కు అనుగుణంగా రూపొందించిన అన్ని తీర్మానాలకు ఆమోదం తెలిపాయి.

ఇక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వాజ్‌పేయి పేరును ఉపయోగించుకుని మళ్లీ అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.. అజేయ భారత్‌, అటల్‌ బీజేపీ నినాదంతో ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ తన పాత్ర పోషించడంలో విఫలమైందని ఎద్దేవా చేశారు. తమను ఎదుర్కొనే సత్తా లేకే విపక్షాలు కూటమి కడుతున్నాయన్నారు.

త్వరలో జరుగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనా కార్యవర్గ సమావేశంలో కీలక చర్చ జరిగింది. తెలంగాణ ముందస్తు ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కార్యవర్గ సమావేశాలకు హాజరైన తెలంగాణ బీజేపీ నేతలు.. ప్రధానితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

బీజేపీకి మరో 50 ఏళ్ల వరకు ఎదురు లేదని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 21 కోట్ల కుటుంబాలకు మన వాణిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.