పెట్రోల్ ధరలకు కారణాలేంటంటే..

cause-of-petrol-rates-hike

మనదేశంలో చమురు ధరలు మండిపోతున్నాయి. రూపాయి విలువ పతనం దీనికో ప్రధాన కారణమైతే.. ఇరాన్‌ చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షల ప్రభావం మరో కారణం. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు అమలుకావడానికి నవంబరు నాలుగోతేదీ దాకా సమయం ఉన్నా.. ముందు నుంచే.. ఇరాన్‌ చమురుపై ఆధారపడిన వివిధ దేశాలకు ఇక్కట్లు మొదలయ్యాయి. అధికంగా దిగుమతి అయ్యే మన దేశంలో ఇది మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఇరాన్‌ నుంచి దిగుమతులు చాలావరకు తగ్గిపోయాయి. ఇరాన్‌ ముడి చమురు సరఫరా పూర్తిగా ఆగిపోతే.. ధరలు ఇంకెంతగా పెరుగుతాయోనన్న భయాందోళనలు వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నాయి. ధరలు ఇంతగా పెరిగిపోతున్నా.. పన్నులు తగ్గించుకోవడానికి ప్రభుత్వాలు ససేమిరా అంటున్నాయి. అమెరికా ఆంక్షల్ని భారత్‌ ఎంతవరకు ఎదిరిస్తుందన్న ప్రశ్న తలెత్తుతోంది. అమెరికా నిర్ణయాన్ని తాము తిరస్కరించినట్లు చైనా ఇప్పటికే ప్రకటించింది. తమకు మినహాయింపులు ఇవ్వాలని జపాన్‌, దక్షిణ కొరియాలు అమెరికాను అభ్యర్థించాయి.

నానాటికీ పడిపోతున్న రూపాయి విలువ భారత చమురు మార్కెట్‌ను కకావికలు చేస్తోంది. ఈ పతనం ఇలాగే కొనసాగితే.. 2018-19లో మన చమురు దిగుమతి బిల్లు 7. 02 లక్షల కోట్లకు చేరుకోవచ్చునన్న అంచనాలున్నాయి. 2017-18లో 220.43 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల చమురు దిగుమతికి మనదేశం రూ.5.65 లక్షల కోట్లను వెచ్చించింది. 2012-13లో 171.73 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇదంతా ప్రజలపైనే భారం పడే అవకాశం ఉంది.

రూపాయి పతనం… ఇరాన్‌ పై అమెరికా ఆంక్షలు కారణంగా సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి పెట్రోల్‌ ధర లీటర్‌కు 67 ఉండగా.. సోమవారం పెట్రోల్‌ ధర అక్షరాల 88.12 రూపాయలు దాటింది. అంటే సంవత్సర కాలంలో ఇరువై రూపాయలు పెరిగింది. దాదాపు డీజిల్‌ ధరలోనూ ఇదే విధమైన పెరుగదల నమోదైంది. ఈ అంశం వినియోగదారులను తీవ్రంగా కలవరపెడుతోంది. నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు.. యాభైల్లో ఉన్న లీటరు పెట్రోల్‌ ధర ఇప్పుడు తొంభైకి చేరువైంది. ఒకటీ రెండుసార్లు తప్ప… నెలకో రూపాయి చొప్పున పెంచుతూనే ఉన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ అనే తేడా లేకుండా రెండింటిపైనా వినియోగదారులను బాదుతూనే ఉన్నారు.

2017లో మోడీ ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరల విషయంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దాని ప్రకారం రోజుకో రేటు చొప్పున విక్రయించేలా కంపెనీలకు, తద్వారా డీలర్లకు అవకాశం కల్పించింది. దీనివల్ల ప్రజల్లో మరింత గందరగోళం ఏర్పడిందని చెప్పాలి. ఏ రోజు.. ఎంత రేటుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక రోజు యాభై పైసలు పెరిగితే, మరో రోజు రూపాయిన్నర పెరగడం అన్న చందంగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 85.35 రూపాయలు ఉండగా.. డీజిల్ ధర 78.98 రూపాయలుగా ఉంది. ఇక ముంబైలో లీటరు పెట్రోల్ 88.12.. కోల్‌కతాలో 83.61 రూపాయలు ధర పలుకుంది. ఇది రేపటికి మళ్లీ పెరగొచ్చు.