మరణించిందనుకుని చితి పేర్చారు.. అంతలో..

పడుకున్న సమయంలో పాము కాటుకు గురైంది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలనుకున్నా ఉలకలేదు, పలకలేదు. ప్రాణం పోయిందనుకుని బాధతో దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. చితిని పేర్చారు. అంతలో ఆమె శరీరంలో కదలికలు కనిపించాయి కుటుంబ సభ్యులకు.. జార్ఖండ్ చత్రాలో గల సోఖా ప్రాంతానికి చెందిన అమర్ చౌదరి కుమార్తె క్రాంతి కుమారి రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురైంది.

నిద్రలో ఉన్న ఆమె ఏదో కుట్టినట్లు అనిపించి ఉలిక్కి పడి లేచి చూసింది. కాళ్ల దగ్గర పాము కనిపించింది. దాన్ని చూసిన క్రాంతి భయంతో అరచి స్పృహ కోల్పోయింది. కుటుంబసభ్యులు ఆమెను లేపేందుకు ప్రయత్నించినా లేవలేదు. దీంతో మరణించిందనుకుని శ్మశానానికి తీసుకువెళ్లారు. శరీరాన్ని చితి మీదకు చేర్చగానే ఆమెలో కదలిక కనిపించింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం మగథ్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. అక్కడికి తీసుకు వెళుతున్న క్రమంలోనే క్రాంతి కన్నుమూసింది.