నేడు భారత్ బంద్‌

opposition-calls-for-bharat-bandh-tomorrow-all-you-need-to-know

పెట్రో అస్త్రంతో కేంద్రంపై యుద్ధానికి సిద్ధమయ్యాయి విపక్షాలు. అడ్డూఅదుపు లేకుండా పైకి ఎగబాగుతున్న పెట్రో రేట్లపై జనాల్లో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ వారంలో వరుస బాదుడుతో అసంతృప్తి కట్టలు తెచ్చుకొని ఆగ్రహంగా మారుతోంది. పెట్రోల్‌, డీజిల్ రేట్లు పెంపు సరకు రవాణాతో పాటు మార్కెట్ రంగాలపై ప్రభావం చూపుతున్నాయి. నోట్ల రద్దు సమయంలో ఓపిక పట్టిన పార్టీలు పెట్రో రేట్ల విషయంలో కేంద్రంపై యుద్ధానికి సిద్ధమయ్యాయి.

పెరిగిన పెట్రో రేట్లకు నిరసనగా ఈరోజు భారత్ బంద్‌కు పిలుపునిచ్చినా ఆదివారం నుంచే బంద్ సన్నాహాక నిరసనలు ఊపందుకున్నాయి. పెట్రోల్ రేట్లను వ్యతిరేకిస్తూ పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో బైక్ ర్యాలీలతో బంద్‌కు మద్దతు ప్రకటించారు. ఏపీలో వైసీపీ పిలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఎన్నికల సీజన్ కావటంతో భారత్ బంద్‌కు ప్రధాన్యం ఏర్పడింది. నిరసనను ఎలాగైనా విజయవంతం చేసి సత్తా చాటుకోవాలని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కసితో ఉన్నాయి. బంద్ సంపూర్ణం చేసి తమ బలాన్ని చాటుకోవటంతో పాటు.. బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని చాటే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. భారత్ బంద్ పార్టీల పొత్తు సంకేతాలకు కూడా కేంద్రంగా మారింది. కాంగ్రెస్ ఇచ్చిన బంద్ పిలుపునకు ఆ పార్టీతో కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలన్నీ మద్దుతు తెలిపాయి. అయితే.. ఏపీలో భారత్ బంద్‌పై రాజకీయ దుమారం రాజుకుంది. కాంగ్రెస్ చేపట్టిన బంద్‌కు టీడీపీ మద్దతు తెలపటాన్ని వైసీపీ తప్పుబడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ… ఏపీలోనూ స్నేహ గీతం పాడుతోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

మరోవైపు వైసీపీ వాదనను లెఫ్ట్ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ వేర్వేరుగా బంద్‌కు పిలుపునిచ్చాయని సీపీఐ నేత నారాయణ అన్నారు. పెట్రో రేట్లపై ఆందోళనలో పాల్గొనని పార్టీలు దేశ ద్రోహులుగా మిగిలిపోతారని విమర్శించారు.

పెట్రోల్ రేట్లపై రాజకీయం హీటెక్కిపోతుంటే.. పెట్రో కంపెనీలు పుండు మీద కారం చల్లినట్లు ఆదివారం మరోసారి ధరలను పెంచాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర 85 రూపాయల 35 పైసలకు పెరిగింది. డీజీల్ 78 రూపాయల 98 పైసలకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో పెట్రో రేట్లు పెంచటం అనివార్యమని కంపెనీలు చెప్తున్నాయి.