మైనర్ బాలికపై నలుగురు యువకుల అత్యాచారం.. పెద్దల తీర్పు..

ఆడపిల్ల అత్యాచారానికి గురై ఒంటరిగా రోధిస్తుంటే ఊరంతా ఒక్కటై కామాంధులకు శిక్షపడేలా చూడాల్సిందిపోయి ఊరిపెద్దలే తీర్పు చెప్పారు. రూ.80 వేలు జరిమానా కట్టి బాధిత బాలికను ఊరడించే ప్రయత్నం చేశారు. బాలిక శీలానికి వేలం వేసారు ఊరి పెద్ద మనుషులు. ఉత్తర ప్రదేశ్ అలీఘడ్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల మైనర్ బాలిక అన్నతో కలిసి జీవిస్తోంది. అమ్మా నాన్న లేకపోయినా తానే అన్నీ అయి పెంచాడు అన్న చెల్లెలిని. కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన నలుగురు యువకులు బాలికపై సామూహిక అత్యాచారం జరిపారు.

ఈవార్త దావానంలా ఊరంతా వ్యాపించడంతో పోలీసులకు సమాచారం అందించకుండా గ్రామ పెద్దలే తీర్పు చెప్పాలనుకున్నారు. కేసును మాఫీ చేసే దిశగా తీర్పు చెప్పారు. బాధిత బాలికకు రూ.80 వేలు కట్టమంటూ అత్యాచార నిందితులకు శిక్ష విధించారు. అయితే బాలిక సోదరుడు తమకు నష్టపరిహారం అక్కరలేదని, నిందితులకు శిక్షపడాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకుగాను యువకుడిని గ్రామ పెద్దలు గ్రామం నుంచి బహిష్కరించారు. గ్రామ పెద్ద తీర్పుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోపోవడం గ్రామస్తులను కలచివేస్తోంది.