సూపర్ స్టార్‌కి 25మంది పోలీసులతో భారీ సెక్యూరిటీ..

బయట సాదాసీదాగా ఉంటారు. నటుడన్న విషయాన్ని మరిచిపోయి నా అసలు రూపం ఇదే అంటూ అభిమానులకు ధైర్యంగా చెప్పగల సత్తా ఉన్న నటుడు రజనీ కాంత్. 60 ఏళ్లు పైబడ్డా యంగ్ హీరోలతో పోటా పోటీగా సినిమాల్లో నటిస్తూ అదే స్టైల్‌ని కొనసాగిస్తున్నారు. అందుకే రజనీ సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ప్రేక్షకులు. ఏదో ఒక మెసేజ్‌తో పాటు రజనీని దృష్టిలో పెట్టుకునే రచయితలు రాసే డైలాగ్స్.. అన్నీ అతడి హావభావాలకు సూపర్‌గా సూటవుతాయి.

భారీ బడ్జెట్‌తో తీసే కొన్ని సినిమాలు నిరాశపరిచినా అతడితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘పెట్ట’ లక్నోలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడినుంచి షూటింగ్ నిమిత్తం వారణాసికి షిప్ట్ కానుంది యూనిట్ మొత్తం. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్ తలైవాకి 25 మంది పోలీసులతో భారీ సెక్యూరిటీని కల్పించింది. అంతేకాకుండా ఓ మిలటరీ పోలీస్ వ్యాన్ కూడా షూటింగ్ పూర్తయ్యేవరకు పహారా కాస్తుంటుంది.

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రజనీ పక్కన హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. ఇదిలా ఉండగా రజనీకి భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం పట్ల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రజనీ రాజకీయాల్లోకి వచ్చే విషయంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ భారీ సెక్యూరిటీ వెనుక ఆంతర్యమేమిటన్నది అంతుపట్టని విషయంగా గోచరిస్తున్నది.