రాత్రి 9 దాటిందంటే వ్యభిచార దందా షురు.. అవే వీరి కామకేళికి అడ్డాలు

హైద్రాబాద్ శివారులోని శంషాబాద్.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది? చీకటి పడిందంటే చాలు ఇక్కడ వ్యభిచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో.. అందునా పోలీస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ దందా బహిరంగంగా కొనసాగుతున్నప్పటికీ ఖాకీలు మాకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో.. ఆ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో శంషాబాద్ ప్రపంచ చిత్ర పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కొన్ని అసాంఘిక శక్తులు ఆ ఖ్యాతిని మసకబారేలా చేస్తున్నాయి. ఎయిర్ పోర్ట్ ఏర్పాటుతో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి శంషాబాద్‌లో స్థిరపడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అంతే వేగంగా అసాంఘీక కార్యకలాపాలకు తెరలేసింది. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు.. ముఠాగా ఏర్పడ్డారు. శంషాబాద్‌ను అడ్డాగా చేసుకుని వ్యభిచార దందా సాగిస్తున్నారు.

శంషాబాద్‌లోని మండల కార్యాలయాల సమీపంలోనే తిష్ట వేస్తున్న వీరు రాత్రి తొమ్మిది దాటిందంటే చాలు బేర సారాలు సాగిస్తారు. వ్యాపార సముదాయాలు మూతపడ్డ చోటును వ్యభిచారానికి అడ్డాలుగా మార్చుకుంటున్నారు. దీంతో.. ఇక్కడి వ్యాపారస్తులు నిత్యం తమ షాపుల ముందు కుప్పలు తెప్పలుగా పడి ఉంటున్న కండోమ్‌లను చూసి నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.

పక్కా సమాచారంతో వ్యభిచార దందా గుట్టును రట్టు చేసింది టీవీ5 టీం. కెమెరా చూడగానే విటులు ముఖం చాటేస్తూ పారిపోయే ప్రయత్నం చేశారు.

ఇక్కడే కాదు శంషాబాద్ లోని పలు కాలనీల్లో సైతం గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యభిచార దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పోలీసులు మేల్కొని ఈ చీకటి దందాకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.