తెలంగాణ ఎన్నికల కసరత్తు.. ప్రతీ పార్టీకి 10నిమిషాలు..

తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్. తెలంగాణ ఎన్నికల కసరత్తు.. సంసిద్ధతపై సీఈసీకి వివరించానని చెప్పారు. కేంద్ర ఎన్నికల బృందం మంగళవారం హైదరాబాద్ రానున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ ఉమేష్ సిన్హా బృందం తెలంగాణలో పర్యటించిన తరువాత కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని రజత్ కుమార్ తెలిపారు.

అంతకు ముందు రజత్‌ కుమార్ కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై నివేదిక అందించారు. అందులో ఓటర్ల జాబితా, సిబ్బంది శిక్షణ, పోలింగ్‌ బూత్‌ల వివరాలు, ఎన్నికల సామాగ్రి.. తదితర అంశాలతో కూడిన వివరాలు ఉన్నాయి.

ఎన్నికల నిర్వహణ ఇతర ఏర్పాట్లపై మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యుల బృందం సమీక్ష నుంది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనుంది. సచివాలయం సౌత్ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఈవో కార్యాలయంలో అన్ని రాజకీయపార్టీలతో సమావేశం కానుంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల 30నిమిషాలకు రావాలని పార్టీలను ఆహ్వానించింది. ఒక్కోపార్టీ నుంచి ఇద్దరూ లేదా ముగ్గురు ప్రతినిధులు రావచ్చన్న ఈసీ.. ప్రతీపార్టీకి 10నిమిషాల సమయం కేటాయించింది. పార్టీలకు కేటాయించిన సమయానికి 15నిమిషాల ముందే రావాలని సూచించింది. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో కేటాయించిన సమయం కంటే అదనపు సమయం ఇవ్వడం కుదరదని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.