విశాఖ జిల్లాలో విజయవంతంగా జగన్ యాత్ర

ys jagan padhayta updates

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కంచరపాలెంలో భారీ బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు, పార్టీ అభిమానులు హాజరయ్యారు. దీంతో సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. జగన్‌ బహిరంగ సభకు నగరంలోని ప్రధాన జంక్షన్లల్లో ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. జగన్‌కు ఆహ్వానం పలుకుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా.. గిరిజనులు వారి సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానం పలికారు. బహిరంగ సభ సందర్భంగా మహానగరం వైసీపీ జెండాలతో నిండిపోయింది. భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు వారి అభిమానాన్ని చాటుకున్నారు.

కంచరపాలెంలో బహిరంగ సభలో సీఎం చంద్రబాబుపై జగన్‌ నిప్పులు చెరిగారు. విశాఖకు మెట్రోరైలు, సైన్స్‌ సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఊదరగొడుతున్నారని.. కనీసం 20 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదని విమర్శించారు. చంద్రబాబు వచ్చాక రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు పడిపోయాయన్నారు. అబద్ధాలు చెప్పడంలో సీఎం పీహెచ్‌డీ చేశారని విమర్శించారు.

చంద్రబాబు మంత్రివర్గంలో గజదొంగలు ఉన్నారని జగన్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూములను తనఖా పెట్టి మంత్రి గంటా శ్రీనివాస్ బ్యాంకు రుణాలు తెచ్చుకున్నారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం రైతుల భూములను లాక్కున్నారని.. మంత్రి అయ్యన్న భూముల జోలికి మాత్రం పోలేదన్నారు.

ఇవాళ జగన్‌ విశాఖ నార్త్‌ నియోజకవర్గంలోని నైట్‌ క్యాంప్‌ నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభిస్తారు. అక్కడ్నుంచి తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, దొండపర్తి జంక్షన్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా విశాఖ ఈస్ట్‌ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. వాల్తేరులో బ్రాహ్మణుల ఆత్మీయ సదస్సులో జగన్‌ పాల్గొంటారు. రాత్రికి చిన్న వాల్తేరులో బస చేయనున్నారు.