అందుకే పెట్రోల్, డీజిల్‌పై 2 రూపాయలు తగ్గించాం : సీఎం చంద్రబాబునాయుడు

ap governament decrease 2 rupees over petrol

టీడీపీకి ఎప్పుడూ ప్రజలే హైకమాండ్ అన్నారు చంద్రబాబు. “ప్రజలే ముందు” అనేది తెలుగుదేశం నినాదం అన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక లోటు ఉన్నా.. అన్ని వర్గాలకు మేలు జరగాలన్న ఉద్దేశంతో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 2 రూపాయలు తగ్గించామన్నారు. అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా.. కేంద్రం తీరుపైన, వైసీపీ పైన చంద్రబాబు మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విబేధాలు సృష్టించాలని కేంద్రం చూస్తోందని, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అపోహలు పెంచాలని ట్రై చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా టీడీపీని ఒంటరిని చేయాలని చూసినా.. కుట్రల్ని తాము ధైర్యంగా ఎదుర్కొంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ తో బీజేపీ అంటకాగుతోందన్నారు. గతంలో కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని కోరినవాళ్లే గైర్హాజరు అయ్యారని, అలాగే ఢిల్లీ వెళ్లి మద్దతు కూడగడతానని చెప్పిన వాళ్లు పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు.

కేంద్రం వైఫల్యాలపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని సీఎం చంద్రబాబు నిలదీశారు. ఎన్డీయే ప్రజావ్యతిరేక చర్యల వల్లే తాము కూటమి నుంచి బయకు వచ్చామన్నారు. బీజేపీయేతర పార్టీలు ఏకం కావడాన్ని జగన్ సహించలేక పోతున్నారన్న చంద్రబాబు.. రాష్ట్రాలలో సమర్ధ నాయకత్వం లేకుండా చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. ఆంధ్రప్రశ్ కు జరిగిన నష్టాన్ని కేంద్రం పూడాల్సిందేనన్నారు. సభలో జరిగే చర్చల్లో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా పేదలకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసామన్న చంద్రబాబు.. హౌసింగ్‌లో ఎస్సీలకు 10 రెట్లు, ఎస్టీలకు 12 రెట్లు మేలు చేశామన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు.