కాసులకు కక్కుర్తిపడ్డ అధికారులు..మరో రూట్లో వెళ్లాల్సిన బస్సును…

ప్రఖ్యాత కొండగట్టు అంజన్న క్షేత్రం. అసలే మాస్‌కు మహా దగ్గరైన దేవుడాయన. తెలంగాణ, ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అందులోనూ మంగళవారం.. భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంది. ఆదాయాన్ని వెనకేసుకోవాలనుకోవడమే తప్ప.. రద్దీకి తగ్గట్టుగా బస్సులు నడపడంలో ఆర్టీసీ ఘోరంగా విఫలమైంది. అందుకే వచ్చిన ఒక్క బస్సులో కిక్కిరిసినట్టు ఎక్కేశారు భక్తులు. అప్పటికే శనివారంపేట నుంచి వస్తున్న బస్సులో స్థానికజనాలు కూడా ఉన్నారు. కండక్టర్‌ మొత్తం తీసుకున్న టిక్కెట్లు 86. అంటే బస్సు ఎంత కిక్కిరిసి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత ఓవర్‌లోడ్‌తో.. అదీ ఘాట్‌రోడ్డుపై బస్సును నడపడమంటే ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడడం కాక మరేమిటి?

నిజానికి, ఆర్టీసీ బస్సులకు ఘాట్‌రోడ్డుపైకి అనుమతే లేదు. అయితే కాసులకు కక్కుర్తిపడి ఆర్టీసీ అధికారులు బస్సులను ఘాట్‌రోడ్డుపైకి అనుమతించారు. శ్రావణమాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, మరింత ఆదాయం సమకూరుతుందని అత్యాశతో ఘాట్‌రోడ్డు మీదకు ఆర్టీసీ బస్సులు తిప్పుతోంది. ఫలితంగా.. ఆర్టీసీ అత్యాశకు ప్రయాణికులు బలైపోయారు. ప్రమాదానికి గురైన బస్సు.. ఈ రూట్లో వెళ్లాల్సింది కూడా కాదు. నాచుపల్లి, దొంగలమర్రి మీదుగా జగిత్యాల వెళ్లాల్సిన బస్సు.. మంగళవారం కావడంతో ఘాట్‌రోడ్డు మీదుగా వెళ్లింది.

కొండగట్టుకు రద్దీ పెరుగుతున్నది తెలిసినా అక్కడి రోడ్లను విస్తరించడంలో.. ఆర్‌ అండ్‌ బీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఘాట్‌ మార్గంలో సిమెంట్‌ రోడ్డు వేయడమేంటనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అసలే వంపులు తిరిగి ఉండే ఘాట్‌ మీద.. సిమెంట్‌ రోడ్డు కారణంగా వాహనాలు జారిపడే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటివరకు ఎన్నో కార్లు, జీపులు… ఘాట్‌రోడ్డులో ప్రమాదానికి గురయ్యాయి. అయినా అధికారులకు పట్టడం లేదు. ఎన్ని ప్రమాదాలు జరిగి, మరెన్ని ప్రాణాలు పోతే అధికారుల్లో చలనం వస్తుందో తెలియడం లేదు.

ఆర్టీఏ అధికారులు, పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం కూడా కొండగట్టు ఘాట్‌రోడ్డును మృత్యుదారిగా మార్చేసింది. సరైన చెక్‌పాయింట్‌లు లేకపోవడం, తనిఖీలు జరుపకపోవడం వల్ల తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయినా ప్రభుత్వాధికారులకు చీమకుట్టినట్టయినా ఉండడం లేదన్నది స్థానికుల వాదన. పేదల దేవుడే కదా అని.. కొండగట్టు ఘాట్‌రోడ్డును అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనిపిస్తోంది. ఇవి కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

దేశంలో ఇప్పటి వరకూ అనేక ఘాట్‌రోడ్లలో ప్రమాదాలు జరిగాయి. ఇంతకంటే పెద్ద ఘాట్‌రోడ్లలో బస్సులు బోల్తాపడ్డాయి. కానీ ఇంతటి ప్రాణనష్టం ఎప్పుడూ జరగలేదు. అందులోనూ ఒక ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటనలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం దేశచరిత్రలోనే ఇది తొలిసారి. మొత్తంగా ఆర్టీసీకి ఇదొక బ్లాక్‌ డే. అధికారుల నిర్లక్ష్యం ఖరీదు 51 మంది ప్రాణాలు. తమ అలసత్వంతో అధికారులు సృష్టించిన అరాచకమిది. ఎన్నో కుటుంబాల్లో చీకట్లు నింపింది.