తెలంగాణలో 119 సీట్లకు కాంగ్రెస్ పోటీ చేసేది అన్ని సీట్లేనా..

congress highlevel leaders coming to hyderabad over telangana tickets finalization

తెలంగాణలో మహా కూటమి ఏర్పాటు దిశగా చర్చలు జోరందుకున్నాయి. కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్.. కొన్ని సీట్లు వదులుకుని అయినా సరే విపక్షాలను ఏకతాటిపైకి తేవాలని పట్టుదలగా ఉంది. ఐతే.. పోటీ చేసే సీట్ల విషయంలో తెలుగుదేశం, తెలంగాణ జన సమితి బెట్టు చేస్తుండంతో చర్చల్లో కొంచెం ప్రతిష్టంభన నెలకొంది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ మధ్య పొత్తుకు కొద్ది రోజులుగా చర్చలు సాగుతున్నాయి. ఈసారి ఎట్టిపరిస్తితుల్లోనూ TRSను గద్దె దించాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే.. ఇవాళ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఇవాళ సమావేశం కాబోతున్నారు. కోదండరామ్, చాడ వెంకట్‌రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా పొత్తులపై అవగాహనకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు..ఇవాళ సాయంత్రం నాలుగున్నరకు ఆల్‌పార్టీ నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. ఈలోపు చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది.

పొత్తులపై ఓ పక్క కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతూనే.. మిగతా రాజకీయ పక్షాలను కలుపుకుని వెళ్లేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. నిన్న జరిగిన భారత్‌బంద్… తెలుగుదేశం, తెలంగాణ జన సమితి మధ్య పొత్తుల విషయంలో చర్చలకు వేదికయ్యింది. ఆందోళన సందర్భంగా అరెస్టు చేసిన నేతలందరినీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఎల్.రమణ, కోదండరామ్ మధ్య మాటకు మాట కలిసింది. పొత్తులపై ప్రాధమికంగా చర్చించారు. సాయంత్రం మరోమారు సమావేశమై.. ఎన్నికల వ్యూహంపై చర్చించారు. చాడ వెంకట్‌రెడ్డి కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్‌తో ఈ మూడు పార్టీల నేతలు కలిసి చర్చించబోతున్నారు. ఆ తర్వాత పోటీ చేసే స్థానాలు, ఎక్కడ ఎవరు బరిలోకి దిగాలి అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న ప్రకారం చూస్తే మొత్తం 119 సీట్లకు గాను, కాంగ్రెస్ కనీసం 90 చోట్ల పోటీ చేయాలని భావిస్తోంది. మిగతా సీట్లనే మిత్రపక్షాలకు ఇవ్వాలనుకుంటోంది. ఇక్కడే సరిగ్గా చికొచ్చిపడుతోంది. తాము 36 చోట్ల పోటీ చేస్తామని టీడీపీ చెప్తోంది. 2014 ఎన్నికల్లో గెలిచిన స్థానాలతోపాటు, ఆ ఎలక్షన్లలో రెండో స్థానంలో నిలిచిన చోట్ల కూడా పోటీ పెట్టాలని భావిస్తోంది. అటు తెలంగాణ జన సమితి కూడా ఇంచుమించు ఇన్నే సీట్లపైనే కన్నేసింది. ఐతే.. కోదండరామ్‌ పార్టీకి ఐదురు సీట్లకు మించి ఇవ్వకపోవచ్చంటున్నారు. ఐతే.. చర్చలపై దీనిపై తుది నిర్ణయం రావొచ్చు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఆసక్తికరంగా మారింది. కోదండరామ్ మంచిర్యాల, జనగామ, వరంగల్ పశ్చిమలో ఒక చోట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈసీట్లు కాంగ్రెస్ ఆయనకు కేటాయించేందుకు ఒప్పుకుంటుందా.. ఏం జరుగుతుంది అన్నది త్వరలోనే తేలబోతోంది. ఇక.. సీపీఐ విషయానికి వస్తే ఆ పార్టీ 4 నుంచి 5 చోట్ల పోటీకి ప్లాన్ చేసుకుంటోంది.