ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో దానం రహస్యంగా భేటీ..

danam nagender secretly meets with uttham kumarreddy

ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్‌ మళ్లీ వెనక చూపులు చూస్తున్నారనే ప్రచారం తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది. చాలా నెలలుగా అధికార పార్టీలో చేరాలని విశ్వ ప్రయత్నాలు చేసి చివరకు సఫలమయ్యారు దానం. ఇప్పుడు అధికార పార్టీలోనూ ఇమడలేకపోతున్నారని తెలుస్తోంది.. పార్టీలో చేరే ముందు ఇచ్చిన వాగ్ధానాలను కేసీఆర్‌ పట్టించుకోకపోవడంతో టీఆర్‌ఎస్‌లో దానం పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా మారింది.

ఖైర‌తాబాద్ నుంచి బరిలో దిగాల‌ని భావించిన దానం నాగేందర్‌ ఆశలపై టీఆర్‌ఎస్‌ అధినేత నీళ్లు చల్లారు.. 105 స్థానాల లిస్ట్‌లో ఖైరతాబాద్‌ లేకపోవడం, ఎక్కడ్నుంచి బరిలోకి దింపుతారనే దానిపై ఇంత వరకు క్లారిటీ ఇవ్వకపోవడం, అలాగే ఖైరతాబాద్‌లో మన్నే గోవర్ధన్‌రెడ్డికి టికెట్‌ దక్కుతుందనే ప్రచారం పార్టీలో జరుగుతుండటంతో దానంలో అభద్రతా భవం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో సొంత గూటికి చేరుకోవడమే మంచిదనే అభిప్రాయంలో దానం ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో రహస్యంగా భేటీ అయిన దానం సుదీర్ఘ చర్చలు జరిపారు. అయితే, ఈ ప్రచారాన్ని దానం ఖండించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ టికెట్‌ ఇచ్చినా, ఇవ్వకున్నా తాను టీఆరెస్‌ విజయానికి పనిచేస్తానని దానం నాగేందర్‌ అన్నారు.

అయితే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాయిస్‌ మాత్రం మరోలా ఉంది.. దానంతో రహస్య భేటీపై మీడియాకు లీకు ఇచ్చారు.. దానం నన్ను కలిస్తే తప్పేంటంటూ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే, విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం దానం నాగేందర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునే అంశం తన పరిధిలో లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఏ ప్రయత్నాలైనా డైరెక్ట్‌గా అధిష్టానంతోనే చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. మరి, దానం కాంగ్రెస్‌ గూటికి తిరిగి వస్తారా..? గులాబీ శిబిరంలోనే ఉండిపోతారా..? అనేది ఆసక్తికరంగా మారింది.