డబ్బులు తీసుకున్నట్లు జగ్గారెడ్డి అంగీకరించారు : డీసీపీ సుమతి

dcp-sumathi-press-meet-on-jagga-reddy-arrest

మనుషుల అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆయన కస్టడీ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. జగ్గారెడ్డిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలిన్నారు. అటు.. డబ్బుల కోసమే జగ్గారెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ రిమాండ్‌ రిపోర్ట్‌ టీవీ5 చేతికి చిక్కింది. మనుషుల అక్రమ రవాణా కోసం ఒక్కొక్కరి నుంచి 5 లక్షల రూపాయల చొప్పున.. 15 లక్షల్ని జగ్గారెడ్డి తీసుకున్నారని వివరించారు. డబ్బులు తీసుకున్నట్లు జగ్గారెడ్డి అంగీకరించినట్లు పేర్కొన్నారు. మధు అనే వ్యక్తి ద్వారా గుజరాత్‌కు చెందిన కుటుంబంతో జగ్గారెడ్డికి పరిచయమైందని తెలిపారు. మధును నమ్మి చాలా మందిని అక్రమంగా విదేశాలకు పంపారన్నారు. మనుషుల అక్రమ రవాణా కోసం సంగారెడ్డికి చెందిన కొందరు అధికారులు కూడా సహకరించారని.. అధికారులను బెదిరించి పాస్‌పోర్ట్‌ పొందాక అక్రమ రవాణా చేశారని రిమాండ్‌ రిపోర్ట్‌లో వివరించారు.

భార్యా పిల్లల పేరుతో ఇతరులను అమెరికాకు అక్రమ రవాణా చేశారన్న ఆరోపణలకు పక్కా ఆధారాలు ఉండడంతోనే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టు చేశామని డీసీపీ సుమతి తెలిపారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే.. మాజీ ఎమ్మెల్యే కావడంతో అన్ని వివరాలు సమగ్రంగా పరిశీలించి.. దర్యాప్తు చేసిన తర్వాతే అరెస్టు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సుమతి స్పష్టం చేశారు. పక్కా ఆధారాలు లభించిన తర్వాతే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశామన్నారు.

తూర్పు జగ్గారెడ్డి 2004లో తప్పుడు డాక్యుమెంట్లతో అమెరికా వెళ్లినట్టు గుర్తించామన్నారు. దీనికి సంబంధించి మార్కెట పోలీస్ స్టేషన్ లో నిన్న ఉదయం అంజయ్య అనే ఎస్ఐ ఫిర్యాదు చేశారు. రీజనల్ పాస్ పోర్టు కార్యాలయంతో క్రైమ్ జరిగినట్టు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ బాధ్యతలు సిఐ మట్టయ్యకు అప్పగించారు. దీనిపై అధికారికంగా పాస్ పోర్టు కేంద్రంలో సమాచారం సేకరించామని.. అక్కడ లభించిన ఆధారాల ప్రకారం జగ్గారెడ్డి తన కుటుంబసభ్యుల పేర్లతో మరో కుటుంబాన్ని అమెరికాకు అక్రమరవాణా చేసినట్టు గుర్తించామన్నారు. ఏడేళ్ల కూతురు జయలక్ష్మి వయసు 17 ఏళ్లుగా… 5ఏళ్ల కొడుకు భరత్ సాయిరెడ్డి వయసు 15ఏళ్లుగా చూపించి దొంగ పత్రాలతో అమెరికా వెళ్లి వారిని అక్కడ వదిలేసి వచ్చినట్టు ఆధారాలు దొరికాయన్నారు డీసీపీ సుమతి. కేసులో పేర్లు… ఆధారాలు కరెక్టుగా ఉన్నా.. ఫొటోలు, వయసు ధృవపత్రాలు మార్చారని తెలిపారు. డబ్బు కోసమే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఈ నేరానికి పాల్పడినట్టు డీసీపీ సుమతి అన్నారు. ఈ కేసులో మరిన్నిఆధారాల కోసం విచారణ జరుపుతున్నామని త్వరలోనే పూర్తి వివరాలతో ఛార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. జయప్రకాశ్ రెడ్డితో పాటు.. మరికొంతమంది పేర్లు కూడా ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయన్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -