ఇది విధి ఆడిన వికృత క్రీడే కావొచ్చు… కానీ..

కొండగట్టులో జరిగిన ఘోర ప్రమాదం.. అమాయకుల ప్రాణాలు తీసింది. ఇది విధి ఆడిన వికృత క్రీడే కావొచ్చు. దాని కన్నా ముందు, అధికారగణం ఆడిన నిర్లక్ష్యపు క్రీడ కూడా ఈ ఘోరానికి కారణమని స్పష్టమవుతోంది. ప్రభుత్వశాఖల మధ్య కొరవడిన సమన్వయం అమాయకుల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ప్రధానంగా, ఆదాయమే పరమావధిగా భావిస్తున్న ఆర్టీసీ ఆడిన మృత్యుకేళి ఇదని చెప్పొచ్చు. ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన ప్రమాదంలో.. ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన దాఖలా దేశ చరిత్రలో లేదంటేనే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ఘాట్‌రోడ్డు మీద వెళ్లడమంటేనే.. ప్రమాదపుటంచులో ప్రయాణం చేయడం. అలాంటి ఘాట్‌రోడ్డులో నడిచే బస్సు ఫిట్‌నెస్‌ కండిషన్‌లో ఉండాలి. ఏమాత్రం తేడా ఉన్నా అలాంటి బస్సులను ఆ రూట్లో నడపడం శ్రేయస్కరం కాదు. కానీ ఇక్కడ ప్రమాదానికి గురైన బస్సు పదకొండేళ్ల క్రితం కొనుగోలు చేసింది. దాని ఫిట్‌నెస్‌ ఎలా ఉందో తెలియని పరిస్థితి. అలాంటి బస్సును ఈ రూట్లో నడుపుతున్నారు అధికారులు. కనీసం ఇలాంటి ప్రమాదకరమైన రూట్లో కొత్త బస్సులను, ఫిట్‌నెస్‌ కలిగిన బస్సులను పంపాలన్న ధ్యాసే అధికారులకు కొరవడింది. బస్సులు నడుస్తున్నాయి.. ఆదాయం వస్తోంది.. చల్నేదో గాడీ అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు.

అసలు బస్సులో ఆక్యుపెన్సీ ఎంత? మహా అయితే 45 నుంచి 50 మంది ప్రయాణించవచ్చు. ఏ బస్సులోనైనా సాధారణంగా ఇంతే సీటింగ్‌ కెపాసిటీ ఉంటుంది. మామూలు మార్గాల్లో అయితే మరింత మంది ప్యాసింజర్‌లు ఎక్కినా ఇబ్బంది ఉండదు. కానీ ఘాట్‌రోడ్డు వంటి మార్గంలో అది అత్యంత ప్రమాదకరం. అందుకే తిరుమల ఘాట్‌రోడ్డులో ఒక బస్సులో సామర్థ్యాన్ని మించి ప్యాసింజర్లను అనుమతించరు. కానీ ఇక్కడ ఆర్టీసీ అధికారులకు అవేమీ పట్టవు. ఎంతసేపూ… ఆదాయం పొందడమే వారి లక్ష్యం. ఈరోజు ప్రమాదానికి గురైన జగిత్యాల డిపోకు చెందిన బస్సులో.. డ్రైవర్‌,కండక్టర్‌తో సహా 88 మంది ప్రయాణిస్తున్నారు.