కొండగట్టు దేవుడే కొండంత అండ అనుకున్నారు…కానీ…

“అంజన్న దర్శనం చేసుకున్నాం.. మొక్కులు తీర్చుకున్నాం.. ఇక బెంగలేదు.. కొండగట్టు దేవుడే కొండంత అండగా ఉంటాడులే ” అనుకున్నారు.. “స్వామి శరీరంపై పూసిన చంద్రాన్నే బొట్టుగా పెట్టుకున్నాం.. భయమేలేద”నుకున్నారు.. నిండారా ఆయన దయ ఉంటుందనుకున్నారు. కానీ, అనుకోని ప్రమాదం 46 మందిని అనంతలోకాలకు సాగనంపింది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన ఈ ఘోర ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో చీకట్లు నింపింది. భక్తజనులకు అభయమిచ్చే అంజన్న కోరిన బలి.. ఎంతమాత్రం కాదిది. మరి ఈ ఘోరానికి తప్పెవరిది.. ఆర్టీసీ అధికారులదా? ఆర్టీఏ అలక్ష్యానిదా? పోలీసుల అలసత్వానిదా? రోడ్ల నిర్మాణంలో ఆర్‌ అండ్‌ బీ చూపిన నిర్లక్ష్యానిదా? ఇప్పుడివే ప్రశ్నలు అందరి మెదళ్లనూ చిదిమేస్తున్నాయి.

కాషాయపు చంద్రంతో కళకళలాడే అంజన్న గుట్ట.. ఎర్రటి నెత్తుటితో తడిసింది. జై శ్రీరామ్‌ అని ధ్వనించే చోట.. క్షతగాత్రుల ఆర్తనాదాల వినిపించాయి. అభయమిచ్చే అంజన్న సన్నిధి ఆహాకారాలతో మోగిపోయింది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘోట్‌రోడ్డుపై.. ఆర్టీసీ బస్సు బోల్తాపడి 51 మంది ప్రాణాలు కోల్పోయారు. 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారంపేట నుంచి కొంగట్టు మీదుగా జగిత్యాల వెళుతున్న బస్సు.. ఒక్కసారిగా లోయలో పడిపోయింది. కొద్దిసేపట్లో ఘాట్‌ రోడ్డు ముగుస్తుందనగా ఈప్రమాదం జరుగడం శోచనీయం.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -