ముష్కరులకు మరణ దండన సరైందే : కోర్టు

గోకుల్‌చాట్‌, లుంబినీ పార్కు జంట పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 44 మందిని బలి తీసుకున్న ముష్కరులకు మరణ దండనే సరైందని తీర్పిచ్చింది. ఇప్పటికే దోషులుగా తేల్చిన అనీఖ్‌, ఇస్మాయిల్‌కు ఉరిశిక్ష విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికీ చెరో 10వేల చొప్పున జరిమానా విధించింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన తారిక్‌ అంజున్‌ను కూడా దోషిగా తేల్చిన కోర్టు… అతడికి జీవిత ఖైదు విధించింది.

2007 ఆగస్టు 25 సాయంత్రం లుంబినీ పార్క్‌, గోకుల్‌చాట్‌లో ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. జంట పేలుళ్లలో 44 మంది మృతి చెందగా.. 68 మంది తీవ్రగాయాల పాలయ్యారు. ఈ కేసును అప్పటి ప్రభుత్వం సిట్‌కు అప్పగించగా.. 2008 నవంబరు 30న ఆక్టోపస్‌కు అప్పగించారు. ఆక్టోపస్‌ విభాగం దర్యాప్తు పూర్తిచేసి అభియోగ పత్రాలు దాఖలు చేసిన తర్వాత.. కేసు బాధ్యతలను కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేశారు. దీంతో ఈ మూడు కేసుల విచారణ బాధ్యతను కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ చేపట్టింది.

11 ఏళ్లపాటు కొనసాగిన ఈ కేసులో న్యాయస్థానం అనేక ఛార్జిషీట్లు, వాంగ్మూలాలు సేకరించింది. మొత్తం 245 మంది సాక్షులను విచారించి.. ఈనెల 4న అనీఖ్‌, ఇస్మాయిల్‌ను దోషులుగా తేల్చింది. అయితే ఉగ్ర కుట్రలో తమకెలాంటి భాగస్వామ్యం లేదంటూ దోషులు న్యాయమూర్తి ఎదుట వాదనలు విన్పించుకున్నారు. పోలీసులు తమను ఇరికించారని ఆరోపించారు. కానీ, పోలీసులు పక్కా ఆధారాలు సమర్పించడంతో దోషులకు న్యాయమూర్తి శిక్ష విధించారు. కాగా.. జంట పేలుళ్ల కేసులో అమీర్‌ రెజాఖాన్‌, రియాజ్‌ భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌లు పరారీలోనే ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించి కేసును విడగొట్టి మిగిలిన వారిపై ప్రత్యేక కోర్టు విచారణ పూర్తి చేసింది.

మరోవైపు ఉగ్రమూకకు ఉరిశిక్ష విధించడంపై బాధితులతో పాటు యావత్‌ దేశం హర్షం వ్యక్తం చేసింది. ఎన్‌ఐఏ కోర్ట్‌ తీర్పు ముష్కరులకు గుణపాఠం కావాలని బీజేపీ నేతలు ఆకాంక్షించారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -