ఆ టీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలంటున్న స్థానికులు

congress-tdp-aliance-tension-in-trs

గ్రేట‌ర్ హైద‌రాబాద్ కారులో అస‌మ్మ‌తి రాగం వినిపిస్తోంది. గులాబీ బాస్ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన నాటి నుండే కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌క‌టించిన అభ్య‌ర్ధుల ట్రాక్ రికార్డు స‌రిగ్గా లేదంటున్నారు. పార్టీ నాయకులు ముందు నిరసన గళం విప్పుతున్నారు. అభ్య‌ర్దుల‌ను మార్చాలంటూ బ‌హిరంగంగానే చెబుతున్నారు. మరోవైపు టికెట్ ఆశించిన విఫలమైనవారు కూడా రెబ‌ల్స్ అవతారం ఎత్తుతున్నారు.

ఎల్బీన‌గ‌ర్ లో టీఆర్ఎస్ అభ్య‌ర్ధి రామ్మోహ‌న్ గౌడ్ ని మార్చాలంటున్నారు స్థానిక నాయకులు. గ‌త రెండు రోజులుగా వరుసగా సమావేశం అవుతున్న ఏడుగురు కార్పోరేట‌ర్లు అభ్య‌ర్ధిని మార్చాలని అధిష్టానం వద్ద డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పార్టీకే నష్టం జ‌రుగుతంద‌ని హెచ్చరిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ విషయం కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజ‌క వ‌ర్గంలోని కిందిస్థాయి కేడర్ కూడా రామ్మెహ‌న్ గౌడ్ అభ్య‌ర్ధిత్వాన్ని వ్య‌తిరేకిస్తున్నార‌ని వారు చెబుతున్నారు. కాద‌ని అతనికే టిక్కెట్ ఇస్తే ఓడిపోవ‌డం ఖాయమంటున్నారు. పార్టీకి న‌ష్టం వాటిల్లే ప‌ని తాము చేయ‌మ‌ని.. పార్టీ మేలు కోరే అభ్య‌ర్ధిని మార్చాలంటున్నామ‌ని కార్పొరేటర్లు అధిష్టానం వద్ద వాదిస్తున్నారు.

రామ్మోహన్ గౌడ్ కు టికెట్ ఇవ్వడం పట్ల స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సెగ కార్పొరేటర్లకు కూడా తాకుతుంది. దీంతో వారంతా సమావేశం అయి.. అభ్యర్ధిని మార్చాలని పట్టుబడుతున్నారు. కేవలం పార్టీ గెలవాలన్న లక్ష్యంతోనే తాము అభ్యర్ధిని మార్చాలని కోరుతున్నట్టు చెబుతున్నారు. అయిన అధిష్టానం పట్టించుకోకుండా.. మరో మార్గంలో అయినా..తమ నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. త్వరలో భ‌విష్య‌త్ కార్యా‌చ‌ర‌ణ‌కు సిద్ధమవుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తమ గళం వినిపించడానికి ముందుకురావడం లేదు. పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని… త్వరలోనే తమ అభిప్రాయం చెబుతామని నాయకులు అంటున్నారు.