తెలంగాణలో రూపు దిద్దుకుంటున్న మహాకూటమి

తెలంగాణలో మహాకూటమి రూపు దిద్దుకుంటోంది. TRS, BJP వ్యతిరేక పార్టీలు పొత్తులపై చర్చలకు తెర తీశాయి. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతలు మంతనాలు జరిపారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మహాకూటమి పేరుతో ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలని.. సభలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు.

తెలంగాణలో ఎన్నికల పొత్తులు పొడుస్తున్నాయి. టీఆరెఎస్‌ ఓటమే ఏకైక లక్ష్యంగా బద్ద శత్రువులుగా ఉన్న పార్టీలు ఏకతాటిపైకి వస్తున్నాయి. మహాకూటమి పేరుతో కూటమికి సిద్దమైన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలు తొలిసారిగా పొత్తులపై చర్చలు జరిపారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, టీటీడీపీ అధ్యక్షుడు రమణ, పెద్దిరెడ్డి, రావుల, నామా నాగేశ్వరరావు., సీపీఐ నుండి చాడ, పల్లా వెంకటరెడ్డి, టీజేఎస్ తరపున దిలీప్ చర్చల్లో పాల్గొన్నారు.

పొత్తులపై ఆయా పార్టీలు తమ అభిప్రాయాలను ఉత్తమ్‌కు వివరించారు. టీడీపీ 35 నియోజకవర్గాలు, సీపీఐ 10 నుండి 15 స్ధానాలు కోరుతోంది. తాజా పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించే పరిస్థితి కనింపించడం లేదు. టీడీపీకి 15 నుండి 20, సీపీఐకి 4, టీజేఎస్‌కు 3 నుండి 5 స్ధానాల వరకు అవకాశం కల్పించాలనే యోచనలో పీసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాల అభిప్రాయం తెలుసుకున్న.. పొత్తులపై మరోసారి పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతామన్నారు.

ఎన్నికల ప్రచారంపైనా నేతలు దృష్టి పెట్టారు. సమిష్టి మేనిఫెస్టో రూపొందించుకుని, మహాకూటమి సభలు పెద్ద ఎత్తున నిర్వహించాలని చర్చలు సాగాయి. రెండు, మూడు రోజుల్లో మరోసారి సమావేశమై.. సీట్ల షేరింగ్‌పై మంతనాలు జరపనున్నారు.

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని విపక్షనేతలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చారు. అవసరమైతే రాష్ట్రపతిని కలవాలని, న్యాయస్ధానాలను ఆశ్రయించాలని భావిస్తున్నారు.