ఆ నియోజకవర్గంలో మూడు ముక్కలాట

palvayi sravanthi vs komatireddy rajagopalreddy in munugodu

మునుగోడు నియోజకవర్గంలో మూడు ముక్కలాట నడుస్తోంది.. కాంగ్రెస్‌కు చెందిన పాల్వాయి స్రవంతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తుంటే.. సీపీఐ కూడా పోటీకి రంగం సిద్ధం చేసుకుంటోంది.. వీరిలో టికెట్‌ ఎవరికి దక్కుతుందన్నదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి 2014లో ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి.. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై గెలుపొందారు. అయితే, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చూపు కూడా మునుగోడు వైపే ఉంది.. 2014 నుంచి మునుగోడు నుంచి బరిలోకి దిగాలనే ఉద్దేశంతో రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ క్యాడర్‌తో సమావేశాలు పెడుతున్నారు. కానీ, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికే టికెట్‌ ఇవ్వాలని అధిష్టానం ఫిక్స్‌ అయింది. ఇదే విషయాన్ని కోమటిరెడ్డి సోదరులకూ స్పష్టం చేసింది. వెంకటరెడ్డి తాను నల్గొండ ఎంపీగా పోటీ చేస్తానని, తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని.. మునుగోడులో స్రవంతికే తమ మద్దతు ఉంటుందని గతంలో సన్నిహితుల ముందు చెప్పారు. కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రం తాను మునుగోడు నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఏకంగా గాంధీభవన్‌ ముందే ప్రకటించేసుకున్నారు. అటు పాల్వాయి స్రవంతి, ఇటు కోమటిరెడ్డి వర్గాలు టికెట్‌ తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నాయి.

మరోవైపు తెలంగాణలో ఈసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. అభ్యర్థుల విషయంలోనూ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీడీపీతోపాటు ఇతర పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవాలని యోచిస్తోంది.. అటు సీపీఐ కూడా కాంగ్రెస్‌తో పొత్తుకు సై అంటోంది. ఇద్దరి మధ్యా పొత్తు కుదిరితే సీపీఐ ఈ నియోజకవర్గాన్ని సీపీఐ కోరే అవకాశం ఉంది. సుదీర్ఘకాలం పాటు ఈ స్థానంలో సీపీఐ అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించారు. 2009లో ఉజ్జిని యాదగిరిరావు, 2004లో పల్లా వెంకటరెడ్డి ఇక్కడ్నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఉజ్జిని నారాయణరావు 85, 89, 94లో టీడీపీతో పొత్తులో భాగంగా పోటీచేసిన గెలుపొందారు. ఈ నేపథ్యంలో సీపీఐ కన్ను మునుగోడుపైనే ఉంది..ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు కుదిరి సీపీఐ బరిలోకి దిగితే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి భంగపాటు తప్పదనే ప్రచారం జరుగుతోంది.. మరి, ఈ పొత్తు రాజకీయాలను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎలా హ్యాండిల్‌ చేస్తారు..? పునరాలోచన చేస్తారా..? చూడాలి.