పెట్రో బంద్‌ సక్సెస్‌ కావడంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక

petro bandh success

ఆకాశాన్ని తాకుతున్న పెట్రో ధరలపై.. దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్‌ బంద్‌ పిలుపుకు 21 పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ నుంచి రామ్‌లీలా మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. ప్రధాని మోడీ ఎంతో చేశానని చెప్తున్నా.. అవేవీ జాతి ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు. సామాన్యులపై తీవ్రప్రభావం చూపించే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అదుపు చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.

అటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగాయి. దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడగా.. పలుచోట్ల రైలురోకోలు జరిగాయి. బిహార్‌లో శరద్‌యాదవ్‌ కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్‌జేడీ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. పెరిగిన పెట్రోల్‌ ధరలతో బైక్‌ను నడపడం కన్నా దానిని మోసుకుపోవడమే బెటర్‌ అంటూ భుజాలపై ఎత్తుకుని నిరసన తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతలు బైక్‌లను ఎడ్ల బండిపై ఎక్కించి వినూత్నం నిరసన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు.

భారత్‌ బంద్‌ సందర్భంగా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆందోళనకారులు వాహనాలను ధ్వంసం చేయడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పట్నాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంలో 144 సెక్షన్‌ విధించారు. అటు బంద్‌ సందర్భంగా జరిగిన అల్లర్లపై అధికార బీజేపీ మండిపడింది. బంద్‌ పేరుతో విపక్షాలు హింసాత్మక ఘటనలకు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించింది.

మరోవైపు పెట్రో ధరల నుంచి ఏపీ ప్రభుత్వం ప్రజలకు రిలీఫ్‌ ఇచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతన్న సీఎం.. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

భారత్ బంద్‌ సక్సెస్‌ కావడంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కలిశారు. పెట్రో ధరలపై విపక్షాలు ఒక్కటి కావడం.. ఎన్నికల సమయంలో ఇలాంటి పరిణామం వల్ల ప్రభుత్వంపై పడే ప్రతికూల ప్రభావంపై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎక్సైజ్ సుంకాల తగ్గింపుపై ప్రకటన చేస్తారా అనేది చూడాల్సి ఉంది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -