గుడ్ మార్నింగ్ అంటూనే.. గుడ్‌బై చెప్పేసి వెళ్లిపోయారు.. లైవ్‌లో విద్యావేత్త మృతి

సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందింది. రాబోయే వర్షాన్నీ ఊహిస్తున్నాడు.. రాబోయే వరదల్నీ ఊహిస్తున్నాడు. కానీ నీడలా వెన్నంటి ఉన్న మరణాన్ని మాత్రం ఊహించలేకపోతున్నారు. అప్పటివరకు బాగానే ఉన్నారు. అందుకే లైవ్ ‌షోలో పాల్గొని తన అనుభవాల్ని, తన అంతరంగాన్ని భావి తరలాతో పంచుకోవాలనుకున్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు ప్రముఖ విద్యావేత్త, రచయిత రీటా జతిందర్. దూరదర్శన్ ఏర్పాటు చేసిన ‘గుడ్ మార్నింగ్ జమ్మూ కశ్మీర్’ అనే లైవ్ ప్రోగ్రాంకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు జాహిద్ ముఖ్తర్.

గెస్ట్‌గా వచ్చిన 86 ఏళ్ల రీటా జతిందర్ తన జీవితం గురించి, సాధించిన విజయాల గురించి హోస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ దిలీప్ కుమార్‌కి సంబంధించిన ప్రశ్నకు జవాబిస్తుండగా వెక్కిళ్లు వచ్చాయి. దాంతో ఆమె ఒక్కసారిగా వెనక్కు వాలి పడిపోయారు. ఏం జరిగిందో అర్థంకాని సిబ్బంది వెంటనే ఆమె వద్దకు వచ్చి పరిశీలించగా అప్పటికే జతిందర్ శ్వాస ఆగిపోయింది. ఈ హఠాత్ పరిణామానికి దిగ్భ్రాంతికి గురైన హోస్ట్ లైవ్‌లో భాగంగానే ఆమె దిలీప్ కుమార్‌ని అనుకరిస్తోందని భావించాను. కానీ కళ్ల ఎదుటే విద్యావేత్త కన్నుమూయడం బాధాకరంగా ఉందంటూ ఆవేదనా భరిత క్షణాల్ని గుర్తు చేసుకున్నారు హోస్ట్ ముఖ్తర్.