జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్‌..కాంగ్రెస్‌లో కలవరం

మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన.. కాంగ్రెస్‌ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. సోమవారం రాత్రి పటాన్‌చెరులో జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. ఈ ఉదయం ఆరోగ్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు.

మరోవైపు, జగ్గారెడ్డి అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ సంగారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చింది. జగ్గారెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి పరామర్శించాంరు. కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, జగ్గారెడ్డి భార్య నిర్మలారెడ్డికి ధైర్యం చెప్పారు. అనంతరం ర్యాలీగా బయల్దేరిన సునీతారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

జగ్గారెడ్డి అరెస్టుతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలపై జగ్గారెడ్డిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. 2004లో ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని మనుషుల అక్రమ రవాణా చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఫేక్‌ డాక్యుమెంట్లను సృష్టించి భార్య నిర్మల, కూతురు జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన వారికి పాస్‌ పోర్టు, అమెరికా వీసాలు ఇప్పించినట్టు పోలీసులు చెబుతున్నారు. వారిని అమెరికాలో వదలి వచ్చినట్లు ఆరోపణలున్నాయి. పాస్‌ పోర్టు అధికారుల ఫిర్యాదుతో పద్నాలుగేళ్ల తర్వాత నార్త్‌జోన్‌ మార్కెట్‌ పీఎస్‌లో కేసు నమోదైంది.. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాలా వ్యూహాత్మకంగా జగ్గారెడ్డిని అరెస్టు చేశారు.

ఈ కేసులో మరికొందరికి కూడా హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో జగ్గారెడ్డి దగ్గర పీఏగా పనిచేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిద్దరినీ రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా పంపిన వాళ్లు ఎవరనే వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. దీని వెనుక ఎవరెవరున్నారనే దానిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ కేసుతో మరో ముగ్గురికి సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని కూడా ఒకట్రెండు రోజుల్లో అరెస్టు చేసే అవకాశం ఉంది. అయితే జగ్గారెడ్డి మాత్రం.. ఇది కేసీఆర్‌ కుట్ర అని ఆరోపిస్తున్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక, కుట్ర కేసులు బనాయిస్తున్నారని చెప్పారు.

అటు జగ్గారెడ్డి అరెస్టు కాంగ్రెస్‌లో కలవరాన్ని కలిగించింది.. పోలీసులు కావాలనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. రాత్రి సివిల్‌ డ్రెస్‌లో వచ్చి అరెస్టు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.. పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అధికార పార్టీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగ్గారెడ్డి అరెస్టు నేపథ్యంలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు డీజీపీని కలిశారు.