ఏపీలోనూ రాజుకున్న ఎన్నికల వేడి

తెలంగాణలోనే కాదు..ఏపీలోనూ ఎన్నికల వేడి రాజుకుంటోంది. జనవరిలోనే ఎన్నికలు వచ్చే సూచనలు ఉన్నాయని అంటోంది వైసీపీ. అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేత జగన్‌ దిశానిర్దేశం చేశారు. విశాఖలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఎన్నికల చుట్టే చర్చలు జరిగాయి. మరో నాలుగైదు నెలల్లోనే ఎన్నికలకు జరగబోయే సంకేతాలున్నాయని…ఎన్నికలను ఎదుర్కునేందుకు సర్వం సిద్ధం కావాలని జగన్‌ సూచించారు. బూత్‌ల వారిగా ఇంటింటికి ప్రచారం చేపట్టాలన్నారు.

ఓ వైపు పాదయాత్ర కొనసాగిస్తూనే నియోజకవర్గాలవారీగా, బూత్‌ల వారీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది వైసీపీ. అందుకోసం కార్యచరణను రెడీ చేసుకుంది. ఈ నెల 17 నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించిన వైసీపీ..ప్రతి ముప్పై, ముప్పై ఐదు కుటుంబాలకు బూత్‌ కమిటీ సభ్యుడ్ని నియమించనుంది. ప్రతి నియోజకవర్గం సమన్వయ కర్త..ప్రతి రోజు రెండు బూత్‌లలో గడపగడపకు వెళ్లి ప్రచారం చేసేలా ప్లాన్‌ చేసుకుంది. వారంలో ఖచ్చితంగా ఐదు రోజుల పాటు బూత్‌ కుటుంబాలతో మమేకం కావాలని పార్టీ శ్రేణులకు జగన్‌ దిశా నిర్దేశం చేశారు. అలాగే ఓటర్ల సవరణపై దృష్టి సారించాలని సూచించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

జనవరిలోనే ఎన్నికలు వస్తాయని భావిస్తున్న జగన్‌…ప్రచారానికి తక్కువ సమయం ఉందని..ఇదే ఆఖరి అవకాశమన్నారు. గడువులోగా విస్తృత ప్రచారం చేపట్టాలని, ప్రధానంగా నవరత్వాల ద్వారా ఒక కుటుంబానికి ఎంత మేలు జరుగుతుందనేది ఇంటింటికి వెళ్లి వివరించాలని పార్టీ నేతలకు హితబోధ చేశారు.