కనీసం కడుపు నిండా భోజనం పెట్టలేని స్థితిలో ఉంది : వైయస్ జగన్

ys-jagan-mohan-reddy-interaction-brahmins-visakha

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర విశాఖపట్నంలో కొనసాగుతోంది. సిరిపురం జంక్షన్‌లో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో జగన్ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే బ్రాహ్మణులను ఆదుకుంటానని జగన్ హామీ ఇచ్చారు. బ్రాహ్మణులు బాగుంటేనే సమాజం బాగుంటుందని అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్‌కు 1500 కోట్లు ఇవ్వాలని పలువురు కోరగా.. వాటన్నిటినీ పరిశీలిస్తామని జగన్‌ చెప్పారు. బ్రాహ్మణులను చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.. వాటన్నిటినీ సమావేశంలో చదివి వినిపించారు జగన్‌.

అర్చక వృత్తి నేడు కనీసం కడుపు నిండా భోజనం పెట్టలేని స్థితిలో ఉందని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రతి పేద బ్రాహ్మణుడికి ఐదు వేలు ఆర్థిక సాయం చేస్తానన్న చంద్రబాబు.. ఇప్పటి వరకు ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలోని నేతలు ఆలయాల ఆస్తులు దోచుకుంటున్నారని జగన్‌ మండిపడ్డారు. దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదని, చంద్రబాబుకు చివరకు దేవుడన్నా భయం లేదని అన్నారు.

అంతకు ముందు తాటిచెట్ల పాలెం నుంచి పాదయాత్ర మొదలు పెట్టిన జగన్‌ 80 అడుగుల రోడ్డు, మహారాణి పార్లర్‌, సిరిపురం మీదుగా నడిచారు. అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు.. జగన్‌కు సమస్యలు వివరించారు. నిరుద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు వైసీపీ అధినేతను కలిసి వినతిపత్రాలు అందజేశారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -