కొండగట్టు ప్రమాదం.. బస్సు అందుకే కంట్రోల్ కాలేదు..

cause of kondagattu bus accident

ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్దదైన కొండగట్టు ప్రమాదపు విషాదం ప్రజల్ని దిగ్భ్రాంతికి గురు చేసింది. అంజన్న దర్శనం చేసుకుని.. మొక్కు తీర్చుకున్న భక్తులు.. కొండగట్టు దేవుడే కొండంత అండగా ఉంటాడులే అనుకున్నారు. స్వామి శరీరంపై పూసిన సింధూరం బొట్టుగా పెట్టుకున్నాం.. భయం లేదనుకున్నారు. కానీ, అనుకోని ప్రమాదం అనంతలోకాలకు సాగనంపింది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదం 57 మందిని బలి తీసుకుంది.

మంగళవారం ఉదయం 11 గంటల 10 నిమిషాల సమయంలో.. కిక్కిరిసిన ప్రయాణికులతో కొండగట్టు ఘాట్‌ మీదుగా జగిత్యాల వెళ్తున్న ఆర్టీసీ బస్సు మరో రెండు నిమిషాల్లో మెయిన్‌ రోడ్డు ఎక్కేది. కానీ, ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.. ఒక్క కుదుపు 57 మందిని బలితీసుకుంది.. అదుపు తప్పిన బస్సు ఘాట్‌ రోడ్డు నుంచి లోయలో పడిపోయింది. ప్రయాణికులంతా డ్రైవర్‌ వైపు ఒరగడంతో కంట్రోల్‌ కాలేదు. ప్రయాణికుల హాహాకారాలు, ఆర్తనాదాలు.. తేరుకునేలోపే మృత్యువు విరుచుకుపడింది. కొంతమందికి తలలు పగిలాయి.. మరికొందరికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. ఘటనా స్థలంలో 37 మంది చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 20 మంది చనిపోయారు. మరో 29 మంది ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల్లో 27 మంది మహిళలే ఉన్నారు.

జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఈ దుర్ఘటన ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం. జగిత్యాల డిపోకు చెందిన బస్సు కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి కొండగట్టు ఘాట్‌రోడ్‌ మీదగా జగిత్యాల వైపు వెళ్తోంది. భక్తులతోపాటు సాధారణ ప్రయాణికులను కూడా పరిమితికి మించి ఎక్కించేశారు.. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న బస్సు ఘాట్‌ రోడ్డు చివరి మలుపు దగ్గరకు రాగానే స్టీరింగ్‌ కంట్రోల్‌ తప్పింది.. ముందు వెళ్తున్న కారును తప్పించబోయే సమయంలో టర్న్‌ తీసుకుంది.. ఆ వెంటనే రెయిలింగ్‌ను ఢీకొట్టి లోయలో పడిపోయింది.. ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులంతా డ్రైవర్‌ వైపు పడిపోయారు.. లోయలో పెద్ద పెద్ద రాళ్లు ఉండటంతో ప్రయాణికుల తలలు బండరాళ్లకు బలంగా తగిలాయి. మరికొంతమంది సీట్లలో ఇరుక్కుపోయి ఊపిరాడక చనిపోయారు. మృతులంతా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారే కావడంతో విషాద చాయలు అలుముకున్నాయి. గాయపడిన వారికి కరీంనగర్‌, హైదరాబాద్‌, జగిత్యాల ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

తుక్కుతుక్కయిన బస్సును చూస్తే.. ప్రమాద తీవ్రత ఎంతో అర్ధమవతుంది. నిబంధనలకు విరుద్ధంగా.. కాసుల కక్కుర్తి కోసం ఘట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సును అనుమతించడం వల్లే ఘోరం చోటు చేసుకుంది. బస్సు పరిమితి 40 మంది ప్రయాణికులు మాత్రమే. కానీ, ప్రమాదం జరిగిన బస్సులో వంద మందికిపైగా ఉన్నారు.. సీట్లు నిండిపోయి, చాలా మంది నిలబడి ప్రయాణం చేస్తున్నారు. ఇక ఘాట్‌రోడ్డుపై భారీ వాహనాలపై నిషేధం ఉంది.. కానీ, కాసుల కక్కుర్తి కోసం ఆర్టీసీ అధికారులు ఘాట రోడ్డులో బస్సులు తిప్పుతున్నారు. డ్రైవర్‌కు ఘాట్‌ రోడ్డులో నడిపిన అనుభవం లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి బాధ్యుడిగా జగిత్యాల డిపో మేనేజర్ హనుమంతరావుపై ఉన్నతాధికారులు వేటు వేశారు.

ప్రమాదం విషయం తెలియగానే ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. అలాగే, ఎంపి కవిత, ఆపద్ధర్మ మంత్రులు మహేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ హెలికాప్టర్‌లో జగిత్యాల ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున 5లక్షల ఎక్స్‌గ్రేషియా, ఆర్టీసీ నుంచి మరో 3 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్టు ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.