పోలవరం నిర్మాణంలో చారిత్రక ఘట్టం..

పోలవరం నిర్మాణంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్ వే నిర్మాణంలో అంతర్భాగంగా నిర్మించిన గ్యాలరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌, లోకేష్, బ్రహ్మణి సహా ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అందరూ కలిసి సొరంగంలోకి వెళ్లి పరిశీలించారు.

ప్రాజెక్టు పనులు అత్యంత కీలకమైన దశలో ఉన్నాయని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ ఫీల్డ్ ట్రిప్ చాలా ఉపయోగపడుతుందని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్తున్నారు. సోమవారాన్ని పోలవారంగా పెట్టుకుని నిరంతరం పనుల్ని పర్యవేక్షిస్తున్న సీఎం.. ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయిస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు. కేంద్రం నుంచి సహకారం ఉంటే మరింత స్పీడ్‌గా నిర్మాణం జరుగుతుందంటున్నారు.

రెండు మీటర్ల వెడల్పు, రెండున్నర మీటర్ల ఎత్తులో కిలోమీటరు పొడవైన ఈ సొరంగ మార్గమే గ్యాలరీ. ప్రాజెక్టుకు సంబంధించిన భద్రతాపరమైన అంశాల పరిశీలనలో ఇదే అత్యంత కీలకం. గ్యాలరీ పూర్తైందంటే ప్రాజెక్టు నిర్మాణం కూడా దాదాపు పూర్తైనట్టేనని టీడీపీ నేతలు అంటున్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, నిర్దేశిత సమయానికి పోలవరం ద్వారా నీళ్లిస్తామని చెప్తున్నారు.

స్పిల్‌వే పైన గేట్ల నిర్మాణం కూడా త్వరలోనే మొదలుకాబోతోంది. ఈ లోపు ఈ స్పిల్‌వే అంతర్భాగంలో ఉన్న గ్యాలరీని పూర్తి చేశారు. పోలవరం భారీ నీటి సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు కావడంతో డ్యామ్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. దీన్ని తగ్గించి డ్యామ్‌ పదికాలాలపాటు పటిష్టంగా ఉండేట్టు చూడటం, ఇతర పర్యవేక్షణ అంతా గ్యాలరీ నుంచే జరుగుతుంది. అలాగే, కాంక్రీట్ నిర్మాణం నుండి చెమ్మ రూపంలో వచ్చే ఊట కూడా ఈ గ్యాలరీలోకే వస్తుంది. అలా వచ్చిన నీరు 26వ డీప్ బ్లాకు వద్ద నిర్మించిన సంపులోనికి చేరుతుంది. అక్కడ నాలుగు మోటార్లు ఏర్పాటుచేసి ఊటను బయటకు తోడేస్తారు.

మొత్తం 56 బ్లాకులుగా ఉండే గ్యాలరీలో 48 బ్లాకుల నిర్మాణం పూర్తయ్యింది. 1వ బ్లాకు నుంచి 18వ బ్లాకు వరకూ సమాంతరంగా ఉంటుంది. అక్కడ నుంచి మెట్ల ద్వారా కిందకు దిగుతూ ఒక్కో బ్లాక్ దాటుకుంటూ 36వ బ్లాకు వరకూ వెళ్లిన తర్వాత తిరిగి మెట్లు ఎక్కుతూ 34వ బ్లాకుకు చేరుకుంటారు. 34వ బ్లాకు నుంచి 48వ బ్లాక్ వరకూ సమాంతరంగా ఉంటుంది. గ్యాలరీలో 13, 26, 34 బ్లాకుల వద్ద మధ్యలో బయటకు వచ్చే మార్గాలను ఏర్పాటుచేశారు. అలాగే, గ్యాలరీ సొరంగంలా ఉంటుంది కాబట్టి అధికారులు అక్కడకు వెళ్లినప్పుడు ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా స్పిల్‌వే పైనుంచి గ్యాలరీలోకి గాలి వచ్చేందుకు వీలుగా గొట్టాలను ఏర్పాటుచేశారు. గ్యాలరీలను పరిశీలించడానికి కెమెరాలు కూడా ఏర్పాటుచేశారు.