హ‌స్తం పార్టీకి హ్యాండివ్వడానికి రెడీ అయిన మరో నేత

congress highlevel leaders coming to hyderabad over telangana tickets finalization

పొత్తులు పొడువ‌క ముందే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. రోజుకో నియోజ‌క‌వ‌ర్గం నేత‌ల అందోళ‌న‌తో గాంధీ భ‌వ‌న్ దద్దరిల్లుతోంది. వైరా నియోజ‌క‌వ‌ర్గం నేత‌ల ఆందోళ‌న మ‌రువ‌క‌ముందే కొత్తగూడెం నియోజ‌క‌వ‌ర్గం పంచాయితీ గాంధీ భ‌వ‌న్‌కు చేరింది. పొత్తుల్లో కొత్తగూడెంను సీపీఐ అడుగుతోంద‌న్న వార్తలతో నియోజ‌కవ‌ర్గ కాంగ్రెస్‌ శ్రేణులు గాంధీభ‌వ‌న్ వ‌ద్ద హ‌ల్ చ‌ల్ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్కించుకోని సీపీఐకి ఆ స్థానాన్ని ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. మాజీ మంత్రి వ‌న‌మా వెంకటేశ్వరరావును పోటీలో దింపాలని డిమాండ్ చేశారు. అనంత‌రం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని క‌లిసి వినతిప‌త్రం స‌మ‌ర్పించారు.

ఒక్క కొత్తగూడెమే కాదు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే ప‌రిస్థితి. త‌మ స్థానాల‌ను మిత్రపక్షాలు ఎక్కడ త‌న్నుకుపోతాయోన‌ని నేత‌లు దిగులు ప‌డుతున్నారు. ఇక మ‌రికొంద‌రు త‌మ‌దారి తాము చూసుకుంటున్నారు. పొత్తుల్లో భాగంగా ఉప్పల్‌ నియోజ‌క‌వ‌ర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఆశిస్తోంది. అక్కడి నుంచి సీనియ‌ర్ నేత దేవేంద‌ర్ గౌడ్ కుమారుడు వీరేంద‌ర్ గౌడ్‌ను పోటీలో పెట్టాల‌ని భావిస్తోంది. అయితే దీనికి కాంగ్రెస్‌ నుంచి కూడా సానుకూల సంకేతాలు వెళ్లాయ‌న్న ప్రచారంతో స్థానిక నియోజ‌క వ‌ర్గ ఇన్‌చార్జ్‌ బండారు ల‌క్ష్మారెడ్డి హ‌స్తం పార్టీకి హ్యాండిచ్చి కారెక్కేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే త‌న అనుచ‌రుల‌తో స‌మావేశ‌మైన ఆయ‌న పార్టీ మారాల‌ని డిసైడ్ అయ్యారు. రేపోమాపో గులాబీ కండువా క‌ప్పుకోబోతున్నారు.

మ‌రికొన్ని స్థానాల్లోనూ సీట్ల స‌ర్దుబాటు ఎలా చేస్తారన్నది ఉత్కంఠ‌గా మారింది. ఇటు కాంగ్రెస్‌, అటు తెలుగుదేశం నుంచి క్రియాశీల‌క నాయ‌కులు ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ ప‌డుతుండ‌టంతో పొత్తుల రాజ‌కీయం ఆస‌క్తికరంగా మారింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.ర‌మ‌ణ త‌న సొంత స్థానం జ‌గిత్యాల నుంచి పోటీచేయాలంటే అక్కడ కాంగ్రెస్‌ సీనియ‌ర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి త్యాగం చేయాలి. ఇక టీడీపీకి చెందిన మ‌రో సీనియ‌ర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆశిస్తున్న వ‌న‌ప‌ర్తి స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని హ‌స్తం పార్టీ వ‌దులుకుంటుందా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.

ఇక గ్రేటర్‌ ప‌రిధిలో గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో గెలిచిన స్థానాల‌న్నింటినీ అడ‌గాల‌ని టీడీపీ ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. అందులో జూబ్లీహిల్స్‌ నుంచి పీజేఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణు, శేరిలింగంప‌ల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాద‌వ్, ఎల్బీన‌గ‌ర్లో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వంటి బ‌ల‌మైన నాయ‌కులున్నారు. వీరిని కాద‌ని టీడీపీకి ఆ స్థానాల‌ను హ‌స్తం పార్టీ వదులుకుంటుందా అనేది కూడా అనుమానమే. ఇక జడ్చర్ల నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా టీడీపీ కోరుతుండగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఇప్పటికే అక్కడ పర్చారాన్ని ప్రారంభించారు. ఇటు కాంగ్రెస్‌, టీడీపీ మ‌ధ్యే ఇంత‌పోటీ ఉంటే టీజేఎస్, సీపీఐ పార్టీలు ఆశించే స్థానాల‌తో పొత్తులు పొడుస్తాయా అనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తంగా కూటమికి ముందే సీట్ల కుతకుత మొదలైంది. వీటిని అధిగమించి కాంగ్రెస్ టీడీపీ ఎలా ముందుకెళ్తాయో చూడాలి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.