తెలంగాణలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఈసీ కసరత్తు

elections-commision-meets-all-party-meeting-by-telangana-elections

తెలంగాణలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఈసీ కసరత్తు చేస్తోంది. అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆరుగురు సభ్యుల కేంద్ర ఎన్నికల బృందం వరుస సమీక్షలు చేపట్టింది.. రాత్రి పొద్దుపోయే వరకు రాజకీయ పార్టీలతో విడివిడిగా సమావేశమైంది.. వారి అభిప్రాయాలు, సలహాలు తీసుకుంది.. ఏపీలో విలీనమైన ఏడు ముంపు మండలాల పరిస్థితితోపాటు, మరికొన్ని అంశాలను విపక్ష పార్టీలు ప్రస్తావించాయి.. సమస్యలు పరిష్కరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరాయి.. కేసీఆర్‌ చెప్పిన షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించొద్దని కాంగ్రెస్‌ పార్టీ అధికారుల బృందాన్ని కోరింది.. నాలుగు రాష్ట్రాలతో కాకుండా ముందుగానే ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ చర్యలు తీసుకుంటోందన్న వార్తలపై విపక్ష నేతలు మండిపడ్డారు.

ఇక సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఈసీ అధికారులను కోరాయి. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండకుండా చూడాలని కోరింది.

పండుగలను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల సవరణ వాయిదా వేయాలని బీజేపీ కోరగా.. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ కేంద్ర ఎన్నికల బృందాన్ని కోరింది. ముందస్తు అవసరం లేదని వైసీపీ చెప్పగా.. బీఎస్పీ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలతో భేటీ ముగిసిన తర్వాత సీఈవో రజత్‌కుమార్‌ సహా పలు శాఖల అధికారులతో సీఈసీ డిప్యూటీ చీఫ్‌ కమిషనర్‌ ఉమేష్‌ సిన్హా టీమ్‌ సమావేశం నిర్వహించింది. ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కమిటీ సమావేశం కానుంది. సాయంత్రం సీఎస్‌, డీజీపీ సహా పలు శాఖల ముఖ్య కార్యదర్శులతో భేటీ నిర్వహించనుంది.