తాగొచ్చిన మత్తులో.. అడ్డొచ్చిన బిడ్డను..

నాన్నా అమ్మని కొట్టొద్దు.. అంటూ అడ్డుకోబోయింది. నాన్న మనసు కరుగుతుందోమో అని ఆశపడింది. అమ్మ అంటే నాన్నకి కోపం.. తాగొద్దు.. తాగితే ఇంటికి రావద్దని రోజూ అంటుందని గొడవపడే అమ్మంటే నాన్నకు చాలా కోపం.. నేనంటే నాన్నకు చాలా ఇష్టం కదా అనుకుంది ఆ చిట్టి తల్లి. నాన్నేంచేస్తాడో తెలియకపోయినా, అమ్మని ఏమైనా చేస్తాడేమోనని తాను వద్దని వారిస్తే వెనక్కు తగ్గుతాడనుకుంది. కానీ మద్యం మత్తు అతడిని మానవత్వం లేకుండా చేసింది. విచక్షణాజ్ఞానం కోల్పోయేలా చేసింది. పీకలదాకా తాగి వచ్చిన నాన్న అమ్మని కొడుతుంటే చిన్నారి హృదయం తల్లడిల్లింది. నిద్రలో ఉలిక్కిపడి లేచి కూర్చుంది. విజయనగరం జిల్లా కొమరాడ గ్రామానికి చెందిన హిమరిక వెంకటరావు రోజూ తాగి వచ్చి భార్యని చిత్ర హింసలు పెడుతుండేవాడు.

భార్య గంగులమ్మ తాగొద్దని ఎంత చెప్పినా వినిపించుకునేవాడు కాదు. సోమవారం రాత్రి కూడా తాగొచ్చిన భర్తను నిలదీసింది భార్య. అసలే ఆకలిగా ఉంటే అన్నం పెట్టకుండా ఈ గొడవేంటి అంటూ ఆమెపై కత్తి తీశాడు. భయంతో భార్య అరిచిన అరుపులకి పడుకున్న కుమార్తె సునీత లేచి తండ్రి వద్దకు వచ్చింది. నాన్నా అమ్మని కొట్టొద్దు అంటూ బతిమాలింది. మత్తులో ఉన్న వెంకటరావు తానేంచేస్తున్నాడో అన్న విషయాన్ని మరచి అడ్డొచ్చిన బిడ్డను కత్తితో గాయపరిచాడు. కత్తి బలంగా తగలడంతో పాపకు అధిక రక్తస్రావమైంది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భార్య గంగులమ్మ చేతికి కూడా కత్తి తగలడంతో గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంకటరావును విద్యుత్ స్థంభానికి కట్టేసి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంకటరావుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.