ప్రియుడి పుట్టిన రోజున ప్రియురాలు చేసిన పని చూస్తే..

నేటి యువతరానికి మాట్లాడుకోవడానికి ఓ స్మార్ట్ ఫోన్, చక్కర్లు కొట్టడానికి చేతిలో బండి, పబ్బులు, పార్కుల వెంట తిరగడానికి పర్సులో డబ్బులు ఉంటే చాలనుకుంటున్నారు. అందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడట్లేదు. ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. అబ్బాయి పుట్టిన రోజు నాడు ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లాలనుకున్నారు. కోరికైతే ఉంది కానీ చేతిలో బండి లేదు. ఇందుకోసం అమ్మాయి ఓ ప్లాన్ వేసింది. రోడ్డు పక్కన స్కూటర్‌తో ఆగి ఉన్న దినేష్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. మీ స్కూటరిస్తే అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్లి వచ్చి మీకిచ్చేస్తాను అని దీనంగా అడిగింది. అలా అడిగేసరికి దినేష్ కాదనలేకపోయాడు.

ఆమె మొబైల్ నెంబర్ తీసుకుని బండి ఇచ్చాడు. అరగంటలో వస్తానని చెప్పి వెళ్లిన అమ్మాయి అడ్రస్ లేదు. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇక లాభం లేదనుకుని దినేష్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నెంబరు ట్రేస్ చేయగా ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లా తడ ప్రాంతంలో ఉన్నట్లు చూపించింది. వెంటనే అక్కడి పోలీసులను అప్రమత్తం చేయగా వారు వెళ్లి అమ్మాయిని, ఆమెతో ఉన్న ప్రియుడిని పట్టుకున్నారు. పుట్టిన రోజు జరుపుకోవడానికి వెళుతున్నామని తమ దగ్గర బండి లేకపోవడంతో దినేష్‌ని మోసం చేసి స్కూటర్ తీసుకువెళ్లినట్లు నేరాన్ని ఒప్పుకుంది. పోలీసులు స్కూటర్‌ని స్వాధీనం చేసుకుని దినేష్‌కి అప్పగించారు. ప్రేమ కోసమే ఆ యువతి చోరీకి పాల్పడిందని తెలుసుకున్న దినేష్ ఆమె మీద ఎటువంటి కేసు పెట్టవద్దని పోలీసులకు చెప్పి వెళ్లిపోయాడు. పోలీసులు మాత్రం ఇదేం పనంటూ ఆమెను హెచ్చరించి వదిలేశారు.