దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద బస్సు ప్రమాదం.. అక్షరాలా తప్పు వారిదే..?

kondagattu bus accident

కొండంతా పచ్చదనం.. కొండపై కొలువైన ఆంజనేయస్వామి ఎరుపెక్కిన చందనంతో భక్తులకు అభయం ఇచ్చే స్వామి. భక్తజనంతో కళకళలాడే అంజన్న గుట్ట.. ఎర్రటి నెత్తుటితో తడిసి ముద్దైంది. జై శ్రీరామ్‌ అని ధ్వనించే చోట.. క్షతగాత్రుల ఆర్తనాదాల ప్రతిధ్వనించాయి. అభయమిచ్చే అంజన్న సన్నిధి హాహాకారాలతో మారుమోగిపోయింది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డుపై.. ఆర్టీసీ బస్సు బోల్తాపడి 57 మంది ప్రాణాలు కోల్పోయారు. 37 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇది విధి ఆడిన వికృత క్రీడే కావొచ్చు. దాని కన్నా ముందు, అధికారగణం ఆడిన నిర్లక్ష్యపు క్రీడ కూడా ఈ మారణ హోమానికి కారణమని తెలుస్తోంది. ప్రభుత్వశాఖల మధ్య కొరవడిన సమన్వయం అమాయకుల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ప్రధానంగా, ఆదాయమే పరమావధిగా భావిస్తున్న ఆర్టీసీ ఆడిన మృత్యుకేళి ఇదని చెప్పొచ్చు. ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు.

ఘాట్‌రోడ్డు మీద వెళ్లడమంటేనే ప్రమాదపుటంచులో ప్రయాణం చేయడం. అలాంటి ఘాట్‌రోడ్డులో నడిచే బస్సు ఫిట్‌నెస్‌ కండిషన్‌లో ఉండాలి. ఏమాత్రం తేడా ఉన్నా అలాంటి బస్సులను ఆ రూట్లో నడపడం శ్రేయస్కరం కాదు. కానీ ఇక్కడ ప్రమాదానికి గురైన బస్సు పదకొండేళ్ల కిందట కొనుగోలు చేసింది. దీని ఫిట్‌నెస్‌ ఎలా ఉందో తెలియని పరిస్థితి. అలాంటి బస్సును ఈ రూట్లో నడుపుతున్నారు. కనీసం ఇలాంటి ప్రమాదకరమైన రూట్లో కొత్త బస్సులను, ఫిట్‌నెస్‌ కలిగిన బస్సులను పంపాలన్న ధ్యాసే అధికారులకు కొరవడింది. బస్సులు నడుస్తున్నాయి. ఆదాయం వస్తోంది.. చల్నేదో గాడీ అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు.

ఏ బస్సులోనైనా సాధారణంగా 40 వరకు సీటింగ్‌ కెపాసిటీ ఉంటుంది. మామూలు మార్గాల్లో అయితే మరింత మంది ప్రయాణికులు ఎక్కినా ఇబ్బంది ఉండదు. కానీ ఘాట్‌రోడ్డు వంటి మార్గంలో అది అత్యంత ప్రమాదకరం. అందుకే తిరుమల ఘాట్‌రోడ్డులో ఒక బస్సులో సామర్థ్యాన్ని మించి ఒక్క ప్యాసింజర్‌ను అనుమతించరు. కానీ ఇక్కడ ఆర్టీసీ అధికారులకు అవేమీ పట్టలేదు. కొండగట్టు ప్రమాదానికి గురైన జగిత్యాల డిపో బస్సులో డ్రైవర్‌, కండక్టర్‌ సహా 86 మంది ప్రయాణిస్తున్నారు.

ఇక కొండగట్టు ఘాట్‌రోడ్డుపైకి భారీ వాహనాలకు అనుమతి లేదు. అయితే కాసులకు కక్కుర్తిపడి ఆర్టీసీ అధికారులు బస్సులను ఘాట్‌రోడ్డుపైకి అనుమతించారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, మరింత ఆదాయం సమకూరుతుందని అత్యాశతో ఘాట్‌రోడ్డు మీదకు బస్సులు తిప్పుతున్నారు. అందుకు పలితమే ఈ మరణ మృదంగం. ప్రమాదానికి గురైన బస్సు ఈ రూట్లో వెళ్లాల్సింది కూడా కాదు. నాచుపల్లి, దొంగలమర్రి మీదుగా జగిత్యాల వెళ్లాల్సి ఉంది. మంగళవారం కావడంతో ఘాట్‌రోడ్డు మీదుగా మళ్లించారు.

కొండగట్టుకు రద్దీ పెరుగుతున్నది తెలిసినా అక్కడి రోడ్లను విస్తరించడంలో ఆర్‌ అండ్‌ బీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఘాట్‌ మార్గంలో సిమెంట్‌ రోడ్డు వేయడమేంటనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అసలే వంపులు తిరిగి ఉండే ఘాట్‌ మీద.. సిమెంట్‌ రోడ్డు కారణంగా వాహనాలు జారిపడే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటివరకు ఎన్నో జీపులు, ట్రాక్టర్లు… ఘాట్‌రోడ్డులో ప్రమాదానికి గురయ్యాయి. అయినా అధికారులకు పట్టడం లేదు. ఎన్ని ప్రమాదాలు జరిగి, మరెన్ని ప్రాణాలు పోతే అధికారుల్లో చలనం వస్తుందో తెలియడం లేదు.

ఆర్టీఏ అధికారులు, పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం కూడా కొండగట్టు ఘాట్‌రోడ్డును మృత్యుదారిగా మార్చేసింది. సరైన చెక్‌పాయింట్‌లు లేకపోవడం, తనిఖీలు జరుపకపోవడం వల్ల తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయినా ప్రభుత్వాధికారులకు చీమకుట్టినట్టయినా ఉండడం లేదన్నది స్థానికుల వాదన. పేదల దేవుడే కదా అని.. కొండగట్టు ఘాట్‌రోడ్డును అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనిపిస్తోంది.

దేశంలో ఇప్పటి వరకూ అనేక ఘాట్‌రోడ్లలో ప్రమాదాలు జరిగాయి. ఇంతకంటే పెద్ద ఘాట్‌రోడ్లలో బస్సులు బోల్తాపడ్డాయి. కానీ ఇంతటి ప్రాణనష్టం ఎప్పుడూ జరగలేదు. అందులోనూ ఒక ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటనలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం దేశచరిత్రలోనే ఇది తొలిసారి. మొత్తంగా ఆర్టీసీకి ఇదొక బ్లాక్‌ డే. అధికారుల నిర్లక్ష్యం ఖరీదు 57 నిండు ప్రాణాలు. తమ అలసత్వంతో అధికారులు సృష్టించిన అరాచకమిది. ఎన్నో కుటుంబాల్లో చీకట్లు నింపింది. ఈ ఘటనతోనైనా… పాలకులు, అధికారులు కళ్లు తెరుస్తారా లేదో చూడాలి.