శరవేగంగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు

speedy works in polavaram

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి.. స్పిల్‌ వే గ్యాలరీవాక్‌ను సర్వం సిద్ధం చేశారు అధికారులు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు గ్యాలరీ వాక్‌ను ప్రారంభించనున్నారు. డ్యామ్‌ భద్ర కోణంలో ప్రాజెక్టుల అంతర్భాగంలో ఊరే ఊటను తొలగించి స్పిల్‌వేపై ఒత్తిడి తగ్గించే గ్యాలరీని ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కిలోమీటరు పొడవున ఉన్న ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ గ్యాలరీ వాక్‌ను ప్రారంభించడం ద్వారా పోలవరం నిర్మాణంలో కీలక మైలు రాయిని అధిగమించామని చాటి చెప్పనున్నారు.

స్పిల్‌వే మధ్య భాగం నుంచి 1054 మీటర్ల పొడవునా సొరంగ నిర్మాణం జరిగింది. పునాది నుంచి గేట్ల వరకు ఏర్పాటు చేసిన 48 బ్లాకులకు కింద సొరంగ మార్గమే స్పిల్‌వే గ్యాలరీ పాయింట్‌.. ప్రాజెక్టు మొత్తాన్ని దీని ద్వారా పరిశీలించవచ్చు. దేశంలోనే అతి పెద్దదైన పోలవరం ప్రాజెక్టులో అతి పెద్ద గ్యాలరీగా ఇది రికార్డు సృష్టించనుంది.

ఉదయం 10 గంటల 5నిమిషాలకు 48వ గ్యాలరీ పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. అనంతరం గ్యాలరీలో కిలోమీటర్‌ పొడవునా గరిష్టంగా 72 మీటర్ల లోతులో కాలినడకన స్పిల్‌వే గ్యాలరీని పరిశీలిస్తారు. ఆ తర్వాత స్పిల్‌వే దగ్గర ఐదువేల మందితో ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఈ ప్రతిష్టాత్మక ఘట్టాన్ని తిలకించేందుకు రావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ప్రజాప్రతినిధులంతా కుటుంబాలతో ప్రత్యేక బస్సుల్లో పోలవరం బయల్దేరనున్నారు.

ఇక, ఈ గ్యాలరీ 72 మీటర్ల లోతున ఉండడంతో ఆక్సిజన్‌ అందడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఆక్సిజన్‌ సిలిండర్లను సిద్ధం చేశారు అధికారులు. కాలినడకన తిరిగేందుకు అనువుగా అన్ని ఏర్పాట్లు చేశారు. స్పిల్‌ వే బ్లాకుల్లో ఆక్సిజన్‌ సరఫరా ద్వారా పైభాగంలోని రంధ్రాల ద్వారా పైపులను అమర్చి గాలి అందేవిధంగా జాగ్రత్తలు తీసుకున్నారు.

ముఖ్యమంత్రి సహా ప్రజాప్రతినిధులంతా కుటుంబాలతో ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలవరం మీదుగా 19 గ్రామాలకు వెళ్లే ప్రతీ వాహనాన్నీ యాంటీ నక్సల్స్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌, ఎస్పీ రవిప్రకాశ్‌ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.