తెలంగాణలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు

telangan state politics are changed day to day over elections

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.. ఓ వైపు ఈసీ ఎన్నికల సన్నాహాల్లో ఉంటే.. ఇటు పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.. విపక్ష నేతలంతా రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ నేతలు కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌ అధికార దుర్వినియోగం చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయన్న నమ్మకం లేదని విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఓటర్ల జాబితా తయారవుతున్న సమయంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండటాన్ని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించాయి. తెలంగాణలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని డిమాండ్‌ చేశాయి. జగ్గారెడ్డి అరెస్టు విషయాన్ని కూడా గవర్నర్‌ దగ్గర ప్రస్తావించారు విపక్ష నేతలు. కాంగ్రె్‌ శ్రేణులను భయపెట్టేందుకే జగ్గారెడ్డిని ప్రభుత్వం అరెస్టు చేయించిందని ఆరోపించారు.

కేసీఆర్‌ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎల్‌.రమణ విమర్శించారు. రాజ్యాంగ సంస్థలను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైరయ్యారు. మహా కూటమి మధ్య తగాదాలు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్‌ను వెంటనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తొలగించాలని విపక్ష నేతలు డిమాండ్‌ చేశారు.. డిసెంబరులో తిరిగి ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపైనా గవర్నర్‌కు కంప్లయింట్‌ చేశారు. మొత్తంగా రాష్ట్రంలో ఎన్నికలు సవ్యంగా జరగాలంటే రాష్ట్రపతి పాలన విధించాలంటున్నారు విపక్ష నేతలు.