మహాకూటమి.. టీడీపీ సహా వివిధ పార్టీలకు ఎన్నెన్ని సీట్లంటే..

telangana mahakootami updates

తెలంగాణలో కొత్త పొత్తు పొడుస్తోంది.. మహాకూటమికి బీజం పడింది.. టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా శత్రువులన్నీ ఏకమయ్యాయి.. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ కలిసి మహాకూటమి కట్టాయి.. తొలిసారిగా పార్టీల ముఖ్య నేతలంతా సమావేశమై పొత్తులపై చర్చలు జరిపారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, టీటీడీపీ అధ్యక్షుడు రమణ, పెద్దిరెడ్డి, రావుల, నామా నాగేశ్వరరావు., సీపీఐ నుంచి చాడ, పల్లా వెంకటరెడ్డి, టీజేఎస్ తరపున దిలీప్ చర్చల్లో పాల్గొన్నారు.

పొత్తులపై ఆయా పార్టీలు తమ అభిప్రాయాలను ఉత్తమ్‌కు వివరించారు. టీడీపీ 35 నియోజకవర్గాలు, సీపీఐ 10 నుండి 15 స్ధానాలు కోరుతోంది. తాజా పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించే పరిస్థితి కనింపించడం లేదు. టీడీపీకి 15 నుంచి 20, సీపీఐకి 4, టీజేఎస్‌కు 3 నుంచి 5 స్ధానాల వరకు అవకాశం కల్పించాలనే యోచనలో పీసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాల అభిప్రాయం తెలుసుకున్న నేపథ్యంలో పొత్తులపై మరోసారి పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను ఓడించడానికి మహాకూటమిగా ఏర్పాటవడం తప్పదని అన్నారు.

అటు ఎన్నికల ప్రచారంపైనా మహాకూటమి నేతలు దృష్టి పెట్టారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించుకుని, మహాకూటమి సభలు పెద్ద ఎత్తున నిర్వహించేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. సభలపై సుదీర్ఘగా చర్చించిన నేతలు.. మరో మూడు రోజుల్లో సమావేశమై సీట్ల పంపకాలపై తేల్చనున్నారు.

ప్రతి పక్షాల ఓట్లు చీలిపోకూడదనే మహాకూటమి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ, నిరుద్యోగ, మహిళా సంఘాలతో కలిసి వెళ్లేలా ప్లాన్‌ చేస్తున్నారు మహా కూటమి నేతలు.