శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

tirumala-salakatla-brahmotsavam-2018

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల క్షేత్రం వైకుంఠాన్ని తలపించే విధంగా ముస్తాబైంది. బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ వైభవోపేతంగా జరగనుంది. అనంతరం స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుణ్ని సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష సమర్పణ చేస్తారు. అనంతరం తిరుచ్చి వాహనంపై మాడవీధుల్లో ఊరేగిస్తారు. ఉత్సవాలకు ప్రారంభ సూచికగా భూమాతకు పూజలు చేసి మట్టిని సేకరించి నవపాలికల్లో నవధాన్యాలు చల్లి భద్రపరుస్తారు. సంప్రదాయ కైంకర్యాల నడుమ అంకురార్పణ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు నాంది పలుకుతారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు రమ్మని ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ గురువారం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది.

గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. తొమ్మిదిరోజుల పాటూ జరిగే ఈ ఉత్సవాల్లో మలయప్ప స్వామివారు ఉదయం, రాత్రి సమయాల్లో వివిధ వాహనాల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. 14న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంసవాహనంపై స్వామివారు విహరిస్తారు.. 15న ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం.. అలాగే 16న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనమిస్తారు. 17న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహన సేవ జరుగుతుంది. 18న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం సర్వర్ణ రథం, రాత్రి గజ వాహన సేవ నిర్వహిస్తారు. 19న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. తొమ్మిదోరోజు ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. గత బ్రహ్మోత్సవాల్లో భక్తుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన అధికారులు.. ఆగమ సలహాదారుల సలహాలతో ఈసారి వాటిని అమలు చేయనున్నారు.. ఇప్పటి వరకు రాత్రి 9 గంటలకు వాహన సేవలు మొదలయ్యేవి.. కానీ, ఈ సారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలను రాత్రి 8 గంటలకే ప్రారంభిస్తారు.

ఇక బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ సేవను సాయంత్రం ఏడు గంటలకే ప్రారంభించనున్నారు. భక్తుల మధ్య తోపులాటలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు టీటీడీ అధికారులు. అటు పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 600 సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం చేయనున్నారు. గరుడ సేవ రోజు రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో కనుమ రహదారుల్లో వాహనాల రాకపోకలపై నిషేధం విధించనున్నారు.