క్షణికావేశంతో అమ్మ.. బిడ్డ గొంతులో ఉప్పు పోసి..

కష్టమని తెలిసినా నవమాసాలు మోస్తుంది. పొత్తిళ్లలో బిడ్డను చూసుకుని పడిన బాధనంతా మరిచిపోతుంది. తను తిన్నా తినకపోయినా, కష్టమో సుఖమో పడి బిడ్డను పెంచుతుంది. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే అమ్మ మనసు అల్లాడిపోతుంది. తనవితీరా పొదువుకుంటుంది. కానీ ఇక్కడ తన రెండు నెలల బిడ్డని చేతులారా తనే చంపేసింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఘటన మనసున్న ప్రతి ఒక్కరిని కలచి వేస్తుంది. మహ్మద్ బిచ్చు, సాతీలు మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల వయసున్న ఓ పాప, రెండు నెలల బాబు ఉన్నారు.

బిచ్చు ఈ మధ్య పనికి వెళ్లకుండా ఇంట్లో ఉంటున్నాడు. దాంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. తరచు భార్య భర్తల మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. ఓ రోజు బాబు ఏడుస్తుంటే పాలు తీసుకురమ్మని భర్తకు డబ్బులు ఇచ్చింది సాతీ. కానీ బిచ్చు ఆ డబ్బు మొత్తాన్ని ఖర్చు పెట్టేసి తీరిగ్గా ఇంటికి వచ్చాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాతీ ఆకలితో ఏడుస్తున్న బిడ్డని సముదాయించలేక ఉప్పుని తీసుకువచ్చి చిన్నారి గొంతులో పోసింది. క్షణికావేశంతో చేసిన తప్పుని తెలుసుకుని వెంటనే ఆసుపత్రికి పరిగెట్టింది బిడ్డని తీసుకుని. పరీక్షించిన వైద్యులు అప్పటికే బిడ్డ చనిపోయిందని నిర్ధారించారు. పోలీసులు సాతీని అరెస్టు చేసి విచారిస్తున్నారు.