ఆ నెలలో ఎన్నికలు వస్తాయని భావిస్తున్న జగన్‌

ycp meeting with party leaders in vizag

రానున్న ఎన్నికల కోసం గ్రౌండ్‌ వర్క్‌ మరింత ముమ్మరం చేసింది వైసీపీ. ఏపీలోనూ ముందస్తు అవకాశాలున్నాయని ఆ పార్టీ భావిస్తోంది. నాలుగైదు నెలల్లోనే ఎన్నికలు రావొచ్చని పార్టీ శ్రేణులకు స్వయంగా జగన్‌ సూచించారు. వచ్చే జనవరిలో ఎలక్షన్స్ ఉంటాయన్న ఆయన.. అందుకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖలో విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే అంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు జగన్‌. ఓ వైపు పాదయాత్ర కొనసాగిస్తూనే నియోజకవర్గాలు, బూత్‌ల వారీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 17 నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని జగన్ సూచించారు.

జనవరిలోనే ఎన్నికలు వస్తాయని భావిస్తున్న జగన్‌.. ప్రచారానికి తక్కువ సమయం ఉందని.. జనంలోకి వెళ్లేందుకు ఇదే ఆఖరి అవకాశమని భావిస్తున్నారు. గడువులోగా విస్తృత ప్రచారం చేపట్టాలని, నవరత్నాలతో ఓ కుటుంబానికి ఎంత మేలు జరుగుతుందో ఇంటింటికి వెళ్లి వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. ఆ రకంగా చంద్రబాబు ప్రలోభాలను అడ్డుకోవచ్చని వైసీపీ భావిస్తోంది. అలాగే ఓటర్ల సవరణపై దృష్టి సారించాలని సూచించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

తమ అంచనాల ప్రకారం ఎన్నికలు జనవరిలోనే వచ్చినా.. షెడ్యూల్‌ ప్రకారమే వచ్చినా అధినేత సూచనల మేరకు ఎన్నికలను ఎదుర్కునేలా తాము సిద్ధంగా ఉంటామని పార్టీ నేతలు అంటున్నారు. ప్రతి నియోజకవర్గం సమన్వయకర్త.. ప్రతి రోజు రెండు బూత్‌లలో గడపగడపకు వెళ్లి ప్రచారం చేసేలా ప్లాన్‌ చేశారు. వారంలో ఖచ్చితంగా ఐదు రోజులు ప్రజలతో మమేకం కావాలని జగన్‌ ఆదేశించారు. ప్రతి 30, 35 కుటుంబాలకు ఓ బూత్‌ కమిటీ సభ్యుడ్ని నియమించనున్నారు.