వినాయక చవితి పండుగొచ్చింది…ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది

వినాయక చవితి పండుగొచ్చింది. యావత్‌ దేశానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. కులమతాలకు అతీతంగా పండుగ జరుపుకునేందుకు చిన్నాపెద్దా అంతా సిద్ధమయ్యారు. విద్యుత్‌ దీప కాంతుల్లో గణేశుని మండపాలు శోభాయమానంగా కనబడుతున్నాయి. వినాయక చవితితో తెలుగు రాష్ట్రాల్లో ఉత్సవ శోభ నెలకొంది.

ఏ పూజ చేసినా, ఏ పని తలపెట్టినా ముందుగా స్మరించుకునేది బొజ్జ గణపయ్యనే. సమస్త విఘ్నాల్ని తొలగించి మనోభీష్టాల్ని నెరవేర్చే మహాగణపతే. సకల గణాలకు నాయకుడుగా సమస్త ప్రాణికోటిచే పూజలందుకుంటున్నాడు. నవరాత్రి సందర్భంగా వాడవాడలా వినాయకుడి విగ్రహాలు కొలువుదీరాయి. రంగురంగుల విగ్రహాలు రకరకాల ఆకారాల్లో భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి.

ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. చవితితో ప్రారంభం కానున్న ఉత్సవాలు 21 రోజుల పాటు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో ప్రధాన ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను పూర్తిగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్‌ మహా గణపతి భక్తుల పూజలకు సిద్ధమయ్యాడు. ఈసారి శ్రీ సప్త ముఖ కాళసర్ప మహా గణపతిగా కొలువుదీరనున్నాడు. విగ్రహం ఎత్తు 57 అడుగులు కాగా.. వెడల్పు 24 అడుగులుగా ఉంది. విగ్రహం కుడి పక్కన మండపంలో శ్రీనివాస కళ్యాణ ఘట్టం, ఎడమవైపు శివపార్వతుల కుటుంబాన్ని తీర్చిదిద్దారు. ఇవాళ్టి నుంచి లక్షలాదిగా తరలివచ్చే వారితో ఖైరతాబాద్ భక్తజన సంద్రంగా మారనుంది.

ఖైరతాబాద్‌ గణపతికి తొలిపూజలు రాష్ట్ర గవర్నర్‌ దంపతులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి గవర్నర్‌ దంపతులు రాకూడని పరిస్థితుల్లో ఉన్నారు. దీంతో శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి తొలిపూజలు నిర్వహిస్తారని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

గ్రేటర్‌ పరిధిలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సాధారణ రోజుల్లోనే నగర పోలీసులకు గణేశ్‌ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేయడం ఓ సవాల్‌. ఇదే సమయంలో అటు పదోన్నతులు, ఇటు ఎన్నికల ఎఫెక్ట్‌తో ఇన్‌స్పెక్టర్లు భారీసంఖ్యలో బదిలీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్‌ అంజనీకుమార్‌ జోన్ల వారీగా ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించారు. తమ సిబ్బందికి ఉత్సవాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.