టీఆర్ఎస్ నేతలకు షాకిచ్చిన చెన్నూరు ఘటన

చెన్నూరు టిక్కెట్‌ గొడవ టీఆరెస్‌లో అగ్గి రాజేస్తోంది. తాజా మాజీ ఎమ్మెల్యే ఓదేలుకే టిక్కెట్‌ ఇవ్వాలంటూ అతని అనుచరుడు నిప్పంటించుకున్నాడు. దీంతో 19 మందికి గాయాలయ్యాయి. అయితే.. తనను హత్య చేసేందుకే ఈ కుట్ర జరిగిందంటూ బాల్క సుమన్‌ ఆరోపించడం సంచలనం రేపింది. ఎవరెన్ని చేసినా తన విజయం ఖాయమంటూ ప్రచారంలో స్పీడు పెంచారాయన.

టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాల కంటే..చెన్నూరులో టిక్కెట్ వార్ ఆత్మహత్యాయత్నాల వరకు వెళ్లింది. చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు టిక్కెట్‌ను పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించటంపై అతని అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చెన్నూరు స్థానం ఓదేలుకే ఇవ్వాలంటూ అతని అనుచరుడు గట్టయ్య ఒంటికి నిప్పంటించుకోవటం కలకలం రేపింది.

నియోజకవర్గంలోని ఇందారంలో ప్రచారానికి వెళ్లారు బాల్క సుమన్. ఆయన్ని ఓదేలు అనుచరులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. జనం అంతా ఒక్క దగ్గర గుంపుగా ఉన్న సమయంలో గట్టయ్య ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఒక్కసారిగా రేగిన మంటలతో అతని సమీపంలోని మరో 19 మందికి కూడా గాయాలయ్యాయి. ఇందులో పలువురు ప్రతికా, మీడియా ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. ఇందారం సర్పంచ్ వెంకటేష్, రామారావుపేట MPTC భార్య రాజేశ్వరి, శ్రీరాంపూర్ సీఐ నారాయణ నాయక్‌కు గాయాలయ్యాయి.

మరోవైపు.. ఇది తనపై జరిగిన హత్యాయత్నమని బాల్క సుమన్ అన్నారు. టిక్కెట్లు కేటాయించింది కేసీఆర్ అని.. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారాయన.

చెన్నూరులో అసమ్మతి ఊహించిందే అయినా.. బుజ్జగింపులు, హామీలతో పరిస్థితి చక్కదిద్దొచ్చనే భావనలో ఉన్న టీఆర్ఎస్ నేతలకు ఇందారం ఘటన షాకిచ్చినట్టైంది.