61కి చేరిన కొండగట్టు మృతుల సంఖ్య

కొండగట్టు విషాదం చాలా కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. తాజాగా చికిత్స పొందుతూ ఇద్దరు కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య 61కి చేరగా.. మరో 40 మంది ఆస్పత్రుల్లో ఉన్నారు. కాగా ఘోర ప్రమాదానికి బ్రేక్‌ ఫెయిలే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. చివరి నిమిషంలో బస్సును అదుపు చేసేందుకు డ్రైవర్‌ తీవ్రంగా శ్రమించాడని తెలిపారు.

అంజన్న భక్తులకు కొండంత విషాదాన్ని మిగిల్చిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రజిత, గుడిసె రాజయ్య మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 61కి చేరింది. 101 మందితో కొండగట్టు ఘాట్‌రోడ్డులోని చివరి మూలమలుపు వద్ద పల్లెవెలుగు బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడిన ప్రమాదంలో మొన్న 58 మంది మృతిచెందగా.. నిన్న మరో ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో 40 మంది జగిత్యాల, కరీంనగర్‌, హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొండగట్టు రోడ్డు ప్రమాదంతో ఎన్నో కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మృతులంతా కొడిమ్యాల మండలం తిర్మలాపూర్‌, శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, రాంసాగర్‌, డబ్బుతిమ్మయ్యపల్లి వాసులే. దీంతో ఆ ఐదు గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదంలో మృతిచెందిన వారికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. తుది వీడ్కోలు పలుకుతూ కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు.

కొండగట్టు ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొన్నా.. వాళ్ల బాధ ప్రభుత్వ అధికారులను ఏమాత్రం కదిలించలేకపోతోంది. మృతదేహాల్ని భద్రపరిచేందుకు కనీసం ఫ్రీజర్‌‌ బాక్స్‌లు కూడా సమకూర్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. శనివారపేటలో మూడు మృతదేహాలను ఐస్‌బాక్స్‌లో పెట్టడానికి డబ్బులేక ఐస్‌గడ్డలపై ఉంచారు. దుబాయ్‌లో ఉన్న కుటుంబ సభ్యులు వచ్చాకే అంత్యక్రియలు చేయాల్సి ఉన్నందున.. అప్పటి వరకూ డెడ్‌బాడీల్ని ఐస్ గడ్డల్లో పెట్టి వరిపొట్టు కప్పారు.

మరోవైపు కొండగట్టులో ఘోర ప్రమాదానికి బ్రేక్‌ ఫెయిలే కారణమని తెలుస్తోంది. అంజన్న దర్శనం అనంతరం బస్సు తిరుగు ప్రయాణంలో ఉండగా.. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిలయ్యాయి. ప్రమాదాన్ని ముందే గుర్తించిన డ్రైవర్‌.. బస్సును అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాడు. అయితే ఇంతలోనే స్పీడ్‌ బ్రేకర్‌ వచ్చేసరికి బస్సు ఒక్కసారిగా ఎగిరిపడింది. ఈ క్రమంలో వెనక ఉన్న ప్రయాణికులు డ్రైవర్‌ మీద పడడంతో.. అతను స్టీరింగ్‌ నుంచి పక్కకు పడిపోయాడు. దీంతో బస్సు పూర్తిగా అదుపు తప్పిపోయి.. లోయలో పడిపోయింది. గుడి నుంచి బయల్దేరిన ఐదారు నిముషాల్లోనే ప్రమాదం జరిగిపోయిందని.. ఘటనలో గాయపడిన కండక్టర్‌ తెలిపారు.

కొండగట్టు రోడ్డులో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కాంగ్రెస్‌, టీడీపీ నేతల బృందం పరిశీలించింది. అనంతరం మృతుల కుటుంబాలను పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు కొండగట్టు బస్సు ప్రమాదంపై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు దాఖలైంది. ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకునేలా.. సీఎస్‌, డీజీపీని ఆదేశించాలంటూ లాయర్‌ అరుణ్‌కుమార్‌ పిటిషన్‌ వేశారు.