గుట్టు చప్పుడు కాకుండా ఆయిల్‌ చోరీ

తూర్పుగోదావరి జిల్లాలో చమురు దొంగలు చేతి వాటం చూపిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చమురును తరలించేస్తున్నారు. అల్లవరం మండలం ఓడల రేవు ఓఎన్జీసీ ఆన్‌షోర్‌ టర్మినల్‌కు అతి సమీపంలో ఈ భారీ చోరీ తతంగం వెలుగులోకి వచ్చింది.

ముడిచమురు సరఫరా చేసే పైపుల వెంబడి తనిఖీకి వెళ్లిన అధికారులకు జీడిమామిడి తోటల దగ్గర పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అక్కడ కనిపించిన పైపు లాగి చూస్తే.. చమురు దొంగల డొంక కదిలింది.

ముడి చమురు ప్రవహిస్తున్న ప్రధాన పైపుకు రంధ్రం చేశారు. ఆ పైపుకు గొట్టం అమర్చి.. భూమిలో పాతిపెట్టిన.. 5 వేల లీటర్ల ట్యాంక్‌కు రసఫరా అయ్యే విధంగా దొంగలు ఏర్పాటు చేశారు. దీనిపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు తాటి ఆకులను వాటిపై కప్పి ఉంచారు.

చమురు చోరీని ఆలస్యంగా గుర్తించిన అధికారులు.. అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాలాకాలంగా ఈ ఆయిల్‌ రాకెట్‌గా జరుగుతోందని పోలీసులు భావిస్తున్నారు. ఓఎన్జీసీలో పని చేస్తున్న కిందిస్థాయి అధికారుల కను సన్నల్లోనే ఈ తతంగమంతా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.