వాడవాడలా గణేష్ ఉత్సవ శోభ

పల్లె, పట్నం అని తేడా లేదు. చిన్నాపెద్దా అనే తారతమ్యం లేదు. గణనాథుడి ఉత్సవాలకు అంతా సిద్దమైయ్యారు. భక్తి శ్రద్దలతో గణపయ్యను కొలిచేందుకు విగ్రహాలను కొలువుదీర్చారు. వినాయక చవితితో తెలుగు రాష్ట్రాల్లో ఉత్సవ శోభ సంతరించుకుంది. గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేకస్తానం సంపాదించుకున్న ఖైరతాబాద్ వినాయకుడి ఈసారి 57అడుగులతో సప్తముఖ కాళసర్ప గణనాధుడిగా దర్శనం ఇస్తున్నాడు.

గణేష్ ఉత్సవాల్లో ఖైరతాబాద్‌ గణనాధుడికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. భారీ ప్రతిమతో పాటు ప్రతిఏటా కొత్త అవతారంలో భక్తులకు దర్శణం ఇస్తుంటాడు. ఈసారి ‘శ్రీ సప్త ముఖ కాళసర్ప మహా గణపతి’గా కొలువుదీరాడు. 57 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ముస్తాబు చేశారు.. ఏడు తలలు, 14 చేతులు, తలపై ఏడు సర్పాలతో అలంకరణ చేశారు. విగ్రహం కుడి పక్కన మండపంలో శ్రీనివాస కళ్యాణ ఘట్టం, ఎడమవైపు శివపార్వతుల కుటుంబాన్ని తీర్చిదిద్దారు.

1954 లో ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేషుడు…. ప్రతి యేటా ఒక్కో అడుగు పెరుగుతూ వస్తున్నాడు. 2014 లో 60 అడుగుల ఎత్తులో షష్టి పూర్తి మహాత్సవం కూడా ఘనంగా జరుపుకున్న భారీ గణేషుడు… ఆ తర్వాత నుంచి ఒక్కో అడుగు తగ్గుతున్నాడు. ఈ సంవత్సరం… 57 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. చేతిలో బొమ్మలడ్డును పెట్టారు.

ఖైరతాబాద్ గణేషున్ని దర్శించి..తరించేందుకు ఏటా లక్షల్లో భక్తులు హాజరవుతుంటారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఖైతరాబాద్ భక్తజన సంద్రంగా మారనుంది. రద్ధీని దృష్టిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యూ లైన్స్ ద్వారా దర్శించుకునేలా సౌకర్యం కల్పించారు. భద్రత పరంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఖైరతాబాద్‌ గణపతికి తొలిపూజలు రాష్ట్ర గవర్నర్‌ దంపతులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి తొలిపూజలు నిర్వహిస్తారని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11 గంటల 52 నిమిషాలకు ఖైరతాబాద్ గణేషుడికి తొలి పూజ జరగనుంది.

ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. చవితితో ప్రారంభం కానున్న ఉత్సవాలు 21 రోజుల పాటు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో ప్రధాన ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను పూర్తిగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.