వైసీపీ అధికారంలోకి వస్తే ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తాం

ముస్లింలపై చం‍ద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో చం‍ద్రబాబు ముస్లింల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. దేశంలో మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని క్యాబినెట్‌ ఏదైనా ఉందంటే.. అది కేవలం చంద్రబాబు ప్రభుత్వమేనని మండిపడ్డారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర విశాఖపట్నంలో కొనసాగుతోంది. అరిలోవ BRTS రోడ్డులో జరిగిన ముస్లింల సమ్మేళనంలో జగన్‌ పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తామని హామీల వర్షం కురిపించారు.

చంద్రబాబు హయాంలో ముస్లింల అభివృద్ధికి చేసింది శూన్యమని జగన్ విమర్శించారు. మైనార్టీలను ఓటుబ్యాంకులా చూడటం తప్పించి.. వారి కోసం ఖర్చు చేసింది అంతంతమాత్రమే అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసి.. వడ్డీ లేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

వైసీపీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో అవినీతిమయంగా మారిపోయిన కార్పొరేషన్‌ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. చంద్రబాబు పాలనలో ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని.. కేవలం ఎన్నికల సమయంలోనే ఆయనకు ముస్లింలు గుర్తుకు వస్తారని జగన్‌ విమర్శించారు. ఎన్నికల్లో భాగంగానే గుంటూరులో నారా హమారా.. టీడీపీ హమారా అనే కార్యక్రమం పెట్టారని మండిపడ్డారు. ముస్లింలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఎందుకు లేదని ప్రశ్నించిన జగన్‌.. ముస్లిం పిల్లలపై అన్యాయంగా అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు.