బాల్క సుమన్‌పై హత్యాయత్నం..! :ప్రత్యక్ష సాక్షులు

balka suman

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బుధవారం జరిగిన దుర్ఘటన హత్యాయత్నమా? సిట్టింగ్ ఎంపీ, టీఆరెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్‌పై.. తాజా మాజీ శాసనసభ్యుడు, టీఆరెస్‌ రెబల్‌ నాయకుడు నల్లాల ఓదేలు అనుచరుడు పెట్రోల్‌ పోసినట్టు స్థానికులు చెప్తున్నారు. అయితే.. బాల్క సుమన్ దగ్గర గుమికూడిన కార్యకర్తలు, అధికార యంత్రాంగం అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది.

 

చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ బాల్క సుమన్‌కు కేసీఆర్ కేటాయించడంతో ఓదేలు అలకబూనారు. ఆయన అనుచరులు నాయకత్వంపై ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇందారంలో బాల్క సుమన్ పర్యటించగా.. గట్టయ్య అనే వ్యక్తి ఏకంగా పెట్రోల్‌ సీసాతో రావడం, మంట పెట్టే ప్రయత్నం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తం 12 మంది గాయపడగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాల్క సుమన్‌ సహా మరికొందరిపైనా పెట్రోల్‌ పడిందని జైనుద్దీన్‌ అనే బాధితుడు చెప్తున్నాడు. తామంతా అండగా నిలవడంతో ఎంపీ తప్పించుకోగలిగారని అంటున్నారాయన.

chennuru

అంతకుముందు.. ఓపెన్ కాస్ట్‌ గనుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ కొందరు స్థానికులు ప్లకార్డులు పట్టుకొచ్చి ఆందోళనకు దిగారు. దీంతో.. తమ ఫోకస్‌ మొత్తం వారిపై పెట్టామని.. ఎంపీ కార్యక్రమం సజావుగా సాగేందుకు ప్రయత్నించామని సీఐ చెప్తున్నారు. ఈ క్రమంలో గట్టయ్యను, అతని దగ్గరున్న పెట్రోల్ బాటిల్‌ను పోలీసులు సైతం గమనించలేదు. అయితే.. ఎంపీపై పెట్రోల్‌ చల్లినప్పుడు వెంటనే తాను అప్రమత్తం అయ్యానని.. బాల్క సుమన్‌ను పక్కకు లాగేసినట్టు చెప్పారాయన. ఈ దుర్ఘటనలో సీఐ సైతం గాయపడ్డాడు. చికిత్స పొందుతున్నాడు. ఆ మంటలు టెంట్‌కు అంటుకుని ఉంటే.. చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు.

ఇందారంలో జరిగింది గట్టయ్య ఆత్మహత్యాయత్నం కాదని… బాల్క సుమన్‌పై హత్యాయత్నమనే వాదనకు బలం చేకూరుతోంది. బుధవారమే ఈ విషయాన్ని ఎంపీ చెప్పారు. తనపై పెట్రోల్‌ పోసి, నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారని ప్రజల మధ్య చెప్పారాయన. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులు, గాయపడ్డ బాధితులు చెప్తున్న విషయాలు హత్యాయత్నం జరిగిందనే విషయన్ని బలపరుస్తున్నాయి.

ప్రస్తుతం గట్టయ్య పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఆయన ఓదేలుపై అభిమానంతో ఇలా చేశాడా.. దీని వెనుక ఎవరైనా ఉన్నారా.. అనే విషయాలు తేలాల్సి ఉంది.